Begin typing your search above and press return to search.

షర్మిల ఓవర్ చేస్తోందా ?

By:  Tupaki Desk   |   26 March 2021 9:30 AM GMT
షర్మిల ఓవర్ చేస్తోందా ?
X
ఇంకా రాజకీయాల్లోకి అడుగుపెట్టనేలేదు..పార్టీ పేరు కూడా ప్రకటించలేదు..ఏప్రిల్ 9వ తేదీన నిర్వహించాలని అనుకుంటున్న బహిరంగసభ జరిగేది కూడా అనుమానమే. అయితే రాబోయే ఎన్నికల్లో అధికారం మాత్రం మనదే అంటూ షర్మిల అప్పుడే పెద్ద ప్రకటన చేసేశారు. లోటస్ పాండ్ లో జరిగిన 10 ఉమ్మడి జిల్లాల వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులతో షర్మిల సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఏప్రిల్ 9న నిర్వహించబోయే భారీ బహిరంగసభకు ‘సంకల్ప సభ’ అని పేరు పెట్టారు. సంకల్పసభ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో అధికారం మనదే అంటు ప్రకటించేశారు. ఈ ప్రకటనే కాస్త ఓవర్ గా ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

తెలంగాణాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు పెద్దసంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు ఉన్నారన్నది వాస్తవం. పార్టీ పెట్టిన తర్వాత ఏవైనా ఎన్నికల్లో అభ్యర్ధులు వరుసగా గెలుస్తుంటే షర్మిల చెప్పిన మాటలపై ఎవరికైనా నమ్మకం ఉంటుంది. కానీ ఇపుడు పరిస్ధితి అలాకాదు. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుంది. అధికారంలోకి రావాలనే అందరికీ ఉంటుంది. కాకపోతే ఎవరితోను పొత్తులుండవని, ఒంటరిగానే అధికారంలోకి వచ్చేస్తామని షర్మిల చెప్పిన మాటలే విచిత్రంగా ఉంది.

ఈలోపు జరగబోయేది కేవలం నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక మాత్రమే. పార్టీ ఇంకా పెట్టలేదు కాబట్టి షర్మిల తరపు అభ్యర్ధి రంగంలో లేరు. పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి రావటం అంత వీజీకాదు. ప్రస్తుతానికైతే షర్మిల ప్రకటన కాస్త ఓవర్ గా ఉందనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. మరి పార్టీ ప్రకటించిన తర్వాత షర్మిల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటో చూస్తేకానీ ఏ విషయం నిర్ధారణకాదు. చూద్దాం చివరకు ఏమవుతుందో.