Begin typing your search above and press return to search.

సీనియర్లతో చంద్రబాబు మోహమాటం.. పార్టీకి గ్రహపాటు

By:  Tupaki Desk   |   17 Oct 2020 6:00 AM IST
సీనియర్లతో చంద్రబాబు మోహమాటం.. పార్టీకి గ్రహపాటు
X
‘మోహమాట పడితే అదేదో అయ్యిందని’ ఒకటి తెలుగు సామెత జనబాహుళ్యంలో చాలా పాపులర్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక చంద్రబాబు మోహమాటం కూడా తెలుగుదేశం పార్టీకి చేటు తెస్తోందని టీడీపీలోనే కొందరు క్షేత్రస్థాయి నాయకులు వాపోతున్నారట.. సోషల్ మీడియాలోనూ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.

చంద్రబాబు బాగా నమ్మినవారు.. ఆయన నెత్తిన పెట్టుకున్న వారు చాలా మంది ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా మారారట.. పార్టీలోనూ.. నియోజకవర్గంలోనూ వారి వల్ల వివాదాలే తప్ప చంద్రబాబుకు వచ్చిన ప్రయోజనం ఏదీ లేదని కొందరు నేతలు వాపోతున్నారట.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకొని వారిని పక్కన పెట్టి బాబు ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇంకా పాత చింతకాయపచ్చడి రాజకీయంతోనే నెట్టుకొస్తున్నారన్న చర్చ సాగుతోంది.

ఇందుకు కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు. నెల్లూరు జిల్లా అంటేనే రెడ్ల రాజ్యం. అక్కడ టీడీపీకి బలమైన నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈయన ఐదుసార్లు వరుసగా టీడీపీ నుంచి ఓడిపోయాడు. పెద్దగా పార్టీ బలోపేతం చేసింది కూడా లేదు. ఈయన వైఖరి నచ్చక ఇప్పటికే టీడీపీ నుంచి కీలకమైన రెడ్డి నేతలు వైసీపీలోకి వెళ్లిపోయారన్న గుసగుసలు ఆ జిల్లాలో ఉన్నాయి. అయినా కూడా చంద్రబాబు ప్రతిసారి సోమిరెడ్డికి అందలం ఎక్కిస్తూ ఇప్పటికీ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తుంటారట..

ఇక గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ విషయంలోనూ అక్కడి నేతల్లో వ్యతిరేక భావం ఉందన్న ప్రచారం ఉంది. పార్టీ ప్రయోజనాల కన్నా ఆయన వ్యక్తిగత ప్రయోజనాలే చూస్తారన్న విమర్శలున్నాయి. ఆయనపై సీబీఐ మైనింగ్ కేసు కూడా ఉంది. అయినా కూడా తన సొంత సామాజికవర్గం నేత అయిన యరపతినేనికి చంద్రబాబు పెద్ద పీట వేస్తారని టాక్ టీడీపీ ఉంది.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చింతమనేని ప్రభాకర్ ఎంత వివాదాస్పద నాయకుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఒక్కడి వల్ల టీడీపీకీ బాగా డ్యామేజ్ జరిగినా బాబు మాత్రం ఆయననే వెనకేసుకొస్తాడట.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలే పరమార్థంగా భావించే నేతల విషయంలో చంద్రబాబు మౌనం పార్టీకే అరిష్టం అని నేతలు వాపోతున్నారట.. చంద్రబాబు మారాలని.. మొహమాటం వీడాలని నేతలు హితవు పలుకుతున్నారట.. ఇప్పుడు ఇదే ఆ పార్టీ నేతల్లో జోరుగా చర్చకు దారితీసిందట..