Begin typing your search above and press return to search.

వైసీపీలోకి సంచ‌యిత‌... ఆ ఇద్ద‌రికి చెక్ పెట్టేందుకు సూప‌ర్ ప్లాన్ ?

By:  Tupaki Desk   |   18 Jun 2021 2:00 PM IST
వైసీపీలోకి సంచ‌యిత‌... ఆ ఇద్ద‌రికి చెక్ పెట్టేందుకు సూప‌ర్ ప్లాన్ ?
X
కొద్ది రోజులుగా వ‌రుస వివాదాల్లో ఉంటోన్న విజయనగరం రాజుల వారసురాలు సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజు స‌రికొత్త రాజ‌కీయ నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌న్న టాక్ విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గుప్పుమంటోంది. అశోక్ అన్న కుమార్తె అయిన ఆమె ఆ కుటుంబానికి దూరమై ఏళ్లు గ‌డిచింది. అయితే వైసీపీ రాజ‌కీయ వ్యూహంలో భాగంగా అశోక్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీలో ఉన్న ఆమెకు మాన్సాస్ ట్ర‌స్ట్ చైర్మ‌న్ ప‌ద‌వితో పాటు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సింహాచ‌లం దేవ‌స్థానం చైర్మ‌న్ బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టారు. ఇది రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చివ‌ర‌కు సంచ‌యిత బీజేపీలో ఉన్నా కూడా ఆ పార్టీ నేత‌లు కూడా సంచ‌యిత తీరును త‌ప్పుప‌ట్టారు.

తాజాగా హైకోర్టు సంచయిత నియామ‌కాన్ని ర‌ద్దు చేయ‌డంతో పాటు తిరిగి అశోక్‌గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్‌ ఛైర్మన్‌ పదవి చేపట్టేలా ఆదేశాలు ఇచ్చింది. అశోక్ సైతం హైకోర్టు తీర్పు వ‌చ్చిన వెంట‌నే తిరిగి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టేశారు. దీంతో కొద్ది రోజులుగా వైసీపీ అండ‌తో దూకుడుగా ముందుకు వెళ్లిన సంచ‌యిత వ్య‌వ‌హారం ఇప్పుడు అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క మాదిరిగా మారింది. తాజా ప‌రిణామాల‌తో డిఫెన్స్‌లో ప‌డ్డ సంచ‌యిత రాజ‌కీయంగా మ‌రింత క్రియాశీల‌కం కావాల‌ని చూస్తుంటే.. అటు వైసీపీ అధిష్టానం కూడా జిల్లాలో త‌మ పార్టీలోనే ఒంటెద్దు పోక‌డ‌ల‌తో ఉన్న నేత‌ల‌కు చెక్ పెట్టేందుకు సంచ‌యిత‌ను పార్టీలో చేర్చుకుని మ‌రింత ప్ర‌యార్టీ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యింద‌ట‌.

జిల్లా వైసీపీలో గ్రూపులు ఉన్నాయి. మంత్రులు బొత్స‌కు, శ్రీవాణికి పొస‌గ‌దు. శ్రీవాణికి రాజ‌న్న‌దొర‌కు ప‌డ‌దు. బొత్స‌కు రాజ‌న్న‌దొర‌తోనూ, కోల‌గ‌ల్లతోనూ ఏ మాత్రం ప‌డ‌దు. వీరికి జ‌గ‌న్ స్వ‌యంగా స‌ర్దిచెప్పినా ఎవ్వ‌రూ మాట విన‌డం లేదు. ఈ క్ర‌మంలోనే రాజ వంశానికి చెందిన అశోక్‌కు క్లీన్ ఇమేజ్ ఉంది. వీళ్ల‌ను ఢీకొట్ట‌డం పార్టీలో ఇత‌ర నేతల వ‌ల్ల కావ‌డం లేద‌నే జ‌గ‌న్ అదే రాజ వంశానికి చెందిన సంచ‌యిత‌ను రంగంలోకి దింపారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో సంచ‌యిత భ‌విష్య‌త్తు డోల‌యామానంలో ప‌డింది. ఆమె పేరుకే బీజేపీలో ఉన్నా అక్క‌డ నుంచి స‌పోర్ట్ లేదు. ఈ క్ర‌మంలోనే సంచయిత కాషాయ కండువా పక్కనబెట్టి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆమె అధికారికంగా వైసీపీలో చేరితే జిల్లా రాజ‌కీయాల్లో ఆమె పాత్ర మ‌రింత పెంచాల‌ని చూస్తున్నార‌ట‌. ట్విస్ట్ ఏంటంటే విజ‌య‌న‌గ‌రం సిటీలో త‌న‌కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న కోల‌గ‌ట్ల‌కు సంచ‌యిత‌తో చెక్ పెట్టాల‌ని బొత్స భావిస్తుంటే.. కోల‌గ‌ట్ల మాత్రం సంచ‌యిత‌తో బొత్స & టీంకు చెక్ పెట్టాల‌ని భావిస్తున్నారు. సంచ‌యిత మాత్రం కోల‌గ‌ట్ల‌తోనే ఎక్కువ ట‌చ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. సంచ‌యిత కూడా రాజ‌కీయంగా మ‌రింత యాక్టివ్ అవ్వడంతో పాటు అశోక్‌పై పై చేయి సాధించేందుకే వైసీపీలోకి వెళ్లాల‌ని భావిస్తున్నార‌ట‌.