Begin typing your search above and press return to search.

బ్రిటన్ కాబోయే ప్రధాని రిషి సునక్..? ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   9 July 2022 5:07 AM GMT
బ్రిటన్ కాబోయే ప్రధాని రిషి సునక్..? ఎందుకంటే..?
X
బ్రిటన్ ప్రధాని బోరిస్ రాజీనామా తరువాత ఆ దేశంలో ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తరువాత ప్రధాని ఎవరనే ప్రశ్న వస్తున్నప్పుడు భారత సంతతికి చెందిన రిషి సునక్ పేరు బాగా వినిపిస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టిన ఆయన కచ్చితంగా బ్రిటన్ ప్రధానమంత్రి అవుతానని అంటున్నాడు. దేశంలో వలస వారసత్వంపై ఓ వీడియో రిలీజ్ చేసి ప్రజలను ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఇప్పడు అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ బలోపేతం చేద్దాం అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా ఇప్పటికే సుపరిచితుడైన రిషి.. బ్రిటన్ ప్రధాని అయితే భారత్ తో సంబంధాలు మెరుగుపడుతాయని కొందరు ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకున్న బోరిస్ ప్రభుత్వంలో రిషి సునక్ 2020లో ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. కరోనా విజృంభణ సమయంలో ప్రజలు, ఉద్యోగులకు అండగా అనేక పథకాలను ప్రకటించారు. దీంతో రిషి పాపులర్ వ్యక్తిగా మారారు. ప్రజలు, ఉద్యోగులకు అనుగుణంగా కొన్ని పథకాలు తీసుకురావడంతో దేశంలో ఆయనకు మంచి పేరు ఉంది. 42 ఏళ్ల రిషి బ్రిటన్ ప్రధాని అయితే భారత సంతతికి చెందిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. అయితే ప్రధాని పదవికి పోటీ చేసేందుకు రిషి ఇప్పటికే ఆర్థిక మంత్రి పోస్టుకు రాజీనామా చేశారు.

భారత్ లో ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అల్లుడైన రిషి సౌతాంప్టన్ లో జన్మించారు. తూర్పు ఆఫ్రికా నుంచి బ్రిటన్ వెళ్లిన ఆయన తల్లిదండ్రులు అక్కడే నివసిస్తున్నారు. రిషి వించెస్టర్ కాలేజీ ప్రైవేట్ స్కూల్ లో చేరి ఆక్స్ ఫర్డ్ లో చదివారు . కన్జర్వేటివ్ పార్టీ తరుపున 2 015లో నార్త్ యార్క్ షైర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 2019 నుంచి 2020 వరకు బ్రిటన్ ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సునక్ అప్పటి నుంచి 2022 వరకు ఖజానాకు ఛాన్స్ లర్ గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటన్, భారత్ సంబంధాలు ఇంకా కొనసాగుతాయని పేర్కొన్నారు.

గత ప్రధాని బోరిస్ నాయకత్వాన్ని 40 మందికి పైగా మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బోరిస్ ప్రధాని పదవికి రాజీనామా చేవారు. అయితే కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు ఆయనే పదవిలో ఉంటారు.

వరుస కుంభకోణాలు, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు, నిందితులకు రక్షణగా ఉండడంపై ఎప్పటి నుంచి బోరిస్ పై వ్యతిరేకత వస్తోంది. దీంతో ఆయనపై మంత్రులు తిరుగుబాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిగా ఉన్న రిషు సునక్ మాట్లాడుతూ తాము ఎన్నుకున్న ప్రభుత్వం సమర్థంగా నమ్మకంగా పనిచేయాలని కోరుకోవడం ప్రజల హక్కు అని, కానీ అలా జరగడం లేదని రిషి పేర్కొన్నారు.

ఒకవేళ రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అయితే ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా భారత్ తో బ్రిటన్ సంబంధాలపై సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కన్జర్వేటివ్ పార్టీ భవిష్యత్ నాయకుడిగా రిషి సునక్ పేరు మారుమోగిది. ఇప్పుడు ఆయన అనుకున్నదే నిజం కాబోతుందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. అయితే రిషి ప్రజల మనసును ఏ విధంగా గెలుచుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.