Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్సీని ఆగమాగం చేస్తున్నారే?

By:  Tupaki Desk   |   13 July 2021 6:30 AM GMT
వైసీపీ ఎమ్మెల్సీని ఆగమాగం చేస్తున్నారే?
X
అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటిలా మారిందట.. ఆ వైసీపీ ఎమ్మెల్సీ పరిస్థితి. వార్డు మెంబర్ గా గెలిచిన ఒక చిన్న వైసీపీ నేతను ఏపీ సీఎం జగన్ పట్టం కట్టారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వార్డు మెంబర్ గా గెలుపొంది.. తృటిలో చైర్మన్ పదవిని చేజార్చుకున్న రమేశ్ యాదవ్ ను బీసీ కోటాలో ఏకంగా సీఎం జగన్ కరుణించి ఎమ్మెల్సీ ఇప్పించారు. సామాజిక సమీకరణాల్లో గవర్నర్ కోటాలో ఈ పదవిని దక్కించుకున్నారు.

ఎమ్మెల్సీ అయిన ఆనందంతో ప్రొద్దుటూరు వచ్చిన రమేశ్ యాదవ్ కు ఆయన బీసీ వర్గం నెత్తిన పెట్టుకుంది. సభలు, మర్యాదలు, సన్మానాలతో హోరెత్తించింది. మా వాడు ఎమ్మెల్సీ అయ్యాడని ప్రొద్దుటూరులో పెద్ద ఉత్సవమే చేశారట.. అయితే ఈ క్రమంలోనే కంటగింపుగా మారిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రమేశ్ యాదవ్ కు ఇంటర్నెట్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ అయిన వారం రోజులకే టీడీపీ బీసీ నేత సుబ్బయ్య సమాధి పక్కనే నిన్నూ సమాధి చేస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే దీనికి ఆందోళన చెందిన రమేశ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే బెదిరింపు కాల్స్ పై విచారణకు ఎమ్మెల్సీ కాల్ డేటా అవసరమని పోలీసులు సూచించగా.. రమేశ్ యాదవ్ అనుమతిస్తూ లేఖ ఇచ్చారు.

అయితే రెండు నెలల డేటా కాల్స్ తీసుకోవడానికి బదులు పోలీసులు సంవత్సరం డేటా తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై నిజనిజాలేంటో తెలియదు కానీ.. లీక్ అయ్యిందన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. అదీ కొందరు వైసీపీ నేతలకు లీక్ అయ్యిందని ప్రచారం మొదలైంది. దీంతో రాజకీయంగా రమేశ్ యాదవ్ ఆందోళన చెందుతున్నారని టాక్ నడుస్తోంది.

ఏడాది కాల్ డేటాను రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీలోని ముఖ్యులకు చేరిందనే ప్రచారం జరగడంతో దీనిపై రమేశ్ యాదవ్ ఆందోళన చెందుతున్నట్టు అనుచరుల్లో చర్చ జరుగుతోంది. రమేశ్ యాదవ్ ఏడాది కాలంగా ఎవరెవరితో టచ్ లో ఉన్నాడనేది వెలికితీస్తారేమోన్న ఆందోళన.. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నారట..

ఇక తన కాల్ డేట్ లీక్ అయ్యిందన్న ప్రచారంపై సీరియస్ అయిన రమేశ్ యాదవ్ ఏకంగా సీఎం జగన్ కు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి రెడీ అయిపోయారు. అయితే ఆ కాల్ డేటా లీక్ అయ్యిందా? లేక ప్రత్యర్థులు అలా ప్రచారం చేస్తున్నారా? అన్న దానిపై నిజనిజాలు తెలియాల్సి ఉంది. అయితే కాల్ డేటా పేరుతో జరుగుతున్న ప్రచారం మాత్రం ఈ వైసీపీ ఎమ్మెల్సీని కంగారు పెడుతోందట.. మొత్తంగా సీఎం సొంత జిల్లాల్లో ఓ బీసీ నేతకు ఎమ్మెల్సీ పదవి చిక్కులు తెచ్చిపెట్టిందన్న చర్చ సాగుతోంది.