Begin typing your search above and press return to search.

బీజేపీ ఫైర్ బ్రాండ్ ను పోలీసులు రాత్రంతా తిప్పుతున్నారా?

By:  Tupaki Desk   |   18 Sept 2020 12:15 PM IST
బీజేపీ ఫైర్ బ్రాండ్ ను పోలీసులు రాత్రంతా తిప్పుతున్నారా?
X
గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తనను అమలాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా ఏపీ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత.. నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ ఛైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి వాట్సాప్ మెసేజ్ ను పంపారు. ఏలూరు డీఐజీ సూచన మేరకు అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రైవేటు ప్రాంతంలో నిర్బంధించారని.. రాత్రంతా పోలీసు వాహనంలోనే తిప్పినట్లుగా ఆయన పేర్కొన్నారు.

తనను ఎక్కడ ఉంచారో అడిగితే పోలీసులు చెప్పటం లేదన్నారు. రాజకీయ పార్టీ నేతల్ని బెదిరింపులకు పాల్పడటం జగన్ సర్కారులోనే తాను తొలిసారి చూస్తున్నట్లుగా మండిపడ్డారు. పోలీసు రౌడీ రాజ్యాన్ని జగన్ నడుపుతున్నట్లుగా ఆయన మండిపడ్డారు. విష్ణువర్ధన్ రెడ్డిని గురువారం అర్థరాత్రి వేళ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా అమలాపురం పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి తేజ వెంటేష్ ఖండించారు.

కేంద్ర సహాయమంత్రి హోదా ఉన్న వ్యక్తిని దొంగతనంగా రహస్య ప్రాంతానికి తరలించాల్సిన అవసరం ఏమిటి? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చేసే ఆరాచకాలకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారన్న ఆయన.. విష్ణువర్ధన్ రెడ్డి అరెస్టును తీవ్రంగా తప్పు పట్టారు. ఇదిలా ఉంటే.. మీడియాకు పంపిన సందేశంలో విష్ణువర్ధన్ రెడ్డి పలు అంశాల్ని పేర్కొన్నారు.

కారణం చెప్పకుండానే పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని.. దాదాపు 300 కి.మీ. తనను పోలీసు వాహనంలోనే తిప్పుతూనే ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అతిధిగా తనకు హోదా ఉందని.. తాను రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే వీలుందన్నారు. అయినప్పటికీ.. తనను ఇలా నిర్బంధించటమేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. తనకేం జరిగినా అందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఫైర్ అయ్యారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ నేతను ఏపీ పోలీసులు అర్థరాత్రి వేళ అదుపులోకి తీసుకున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై ఏపీ పోలీస్ బాస్ ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.