Begin typing your search above and press return to search.

ఈ సారి ప‌వ‌న్ క‌ల్యాణ్ రాయ‌ల‌సీమ నుంచేనా?

By:  Tupaki Desk   |   30 March 2022 1:30 PM GMT
ఈ సారి ప‌వ‌న్ క‌ల్యాణ్ రాయ‌ల‌సీమ నుంచేనా?
X
ఏపీలో 2024 ఎన్నిక‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టి నుంచే దృష్టి సారించారు. ఆ ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాల కోసం పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్ పెట్టారు. మ‌రోవైపు పొత్తుల‌కు తెర‌తీసే వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం సొంత ప్ర‌యోజ‌నాలను ప‌క్క‌నపెట్టి క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో పొత్తు పెట్టుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే బీజేపీతో జ‌న‌సేన పొత్తులో ఉంది. ఇక ఎన్నిక‌ల లోపు వాళ్ల‌తో టీడీపీ క‌లిసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేసే సీటు గురించి ప‌వ‌న్ ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని అంటున్నారు.

2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ రెండు చోట్ల పోటీ చేశారు. విశాఖ‌లోని గాజువాక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రం నుంచి బ‌రిలో దిగారు. కానీ జ‌గ‌న్ గాలిని త‌ట్టుకోలేక రెండు చోట్లా ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాన్ని మార్చాల‌నే ఆలోచ‌న‌తో ప‌వ‌న్ ఉన్నారు.

ఒక్క స్థానంలోనే పోటీ చేయాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం. అందుకే కాకినాడ రూర‌ల్ లేదా పిఠాపురం స్థానాల‌పై క‌న్నేశార‌ని టాక్ వ‌చ్చింది. అక్క‌డైతే కాపు సామాజిక వ‌ర్గం బ‌లంగా మారుతుంద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇక ఇప్పుడేమో తాజాగా ప‌వ‌న్ రాయ‌ల‌సీమ నుంచి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం మొద‌లైంది. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న రాయ‌ల‌సీమ నుంచి పోటీ చేయాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ వేవ్‌కు వెనక్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. కానీ ఈ సారి అలాంటి ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త కార‌ణంగా జ‌గ‌న్ గాలి త‌గ్గుతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరుప‌తి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆయ‌న తిరుప‌తి నుంచి బ‌రిలో దిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అక్క‌డ వైసీపీకి అంత‌గా బ‌లం లేదు. గత ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి అతి త‌క్కువ మెజారిటీ వ‌చ్చిన సీటు ఇదే.

దీంతో ప‌వ‌న్ బ‌రిలో దిగితే గెలుపు సాధ్య‌మేన‌న్న అంచ‌నాలున్నాయి. పైగా త‌న సామాజిక వ‌ర్గం అండ‌గా నిలుస్తుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. మ‌రోవైపు గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌పున త‌న అన్న‌య్య చిరంజీవి ఇక్క‌డి నుంచి విజ‌యం సాధించారు. ఆ సెంటిమెంట్ కూడా క‌లిసొస్తుంద‌న్న‌ది ప‌వ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.