Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ఏమైనా వైసీపీకి అధికార ప్రతినిధా...?

By:  Tupaki Desk   |   19 Sep 2022 11:30 AM GMT
పవన్ కళ్యాణ్ ఏమైనా వైసీపీకి అధికార ప్రతినిధా...?
X
పవన్ కళ్యాణ్. ప్రముఖ సినీ నటుడు. అలాగే సొంతంగా జనసేన పార్టీని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్న నాయకుడు. అలాంటి పవన్ మీద ఉన్న అతి పెద్ద ఫిర్యాదు ఏంటి అంటే వర్తమాన రాజకీయాలను ఆయన‌ సరిగ్గా చూడడంలేదు అని. పూర్తిగా అర్ధం చేసుకోవ‌డంలేదు అని. అలాగే ఆయన ఎంతసేపూ ఒక వైపే చూస్తారు అని. ఇక పవన్ సభలకు కానీ పార్టీ సభలకు కానీ వచ్చే జనాలకు ఆయన ఇచ్చే స్పీచెస్ చూస్తే వాటిలో అత్యధిక శాతం మాటలు ముచ్చట్లూ వైసీపీ గురించే ఉంటాయి. అలాగే జగన్ గురించే ఉంటాయి.

మరి పవన్ తన పార్టీ గురించి కదా చెప్పుకోవాలి. విలువైన కాలం వేదికలను ఆయన వైసీపీకి ఇలా అంకితం చేయడం పట్ల చాలాకాలంగా చర్చ ఉంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా మంగళగిరిలో జరిగిన పార్టీ లీగల్ సెల్ సమావేశాన‌ పవన్ కళ్యాణ్ వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చే ఎన్నికల్లో వస్తాయో చెప్పి సంచలనం రేపారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఎన్నికలు ఇంకా ఇప్పట్లో లేవు. పవన్ వచ్చింది ఎన్నికల సభకు కాదు.

తన పార్టీని తాను గట్టిగా పటిష్టం చేసుకోవడానికి. తన పార్టీ అనుబంధ కమిటీలను ఆ దిశగా కార్యోన్ముఖులను చేయడానికి. కానీ పవన్ మాట్లాడుతోంది మాత్రం వైసీపీ గురించి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45 నుంచి 67 సీట్లు వస్తాయని పవన్ చెప్పడం ద్వారా ఏమి అలోచిస్తున్నారు అన్నదే ఇక్కడ చర్చ. నిజానికి పవన్ తన పార్టీ సమావేశంలో తన పార్టీ నాయకులకు చెప్పుకోవాల్సింది జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయని.

మరి ఆ విషయాన్ని ఆయన చెప్పారా అంటే లేదు అనే మాట ఉంది మరి. నిజానికి ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఏ సభలో అయినా ఒకటికి పదిసార్లు మాట్లాడాల్సింది గొంతు చించుకోవాల్సింది జనసేన గురించి. అధినాయకుడే పార్టీ గురించి తలవకపోతే ఎలా. ఇక పార్టీ జనాలు ఎలా మాట్లాడుతారు. తమకు సరైన డైరెక్షన్ పవన్ ఇస్తాడనే కదా వారంతా ఆయన సమావేశం అంటే అన్నీ మానుకుని పనిగట్టుకుని వచ్చింది. అక్కడ వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయని పవన్ చెబితే జనసేన నాయకులకు ఏమి సంతోషం వస్తుంది.

దానికి బదులుగా జనసేన ఇన్ని సీట్లు సాధిస్తుంది, మనం ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారు, రేపటి రోజున మరింత కష్టపడితే దీన్ని మించి ముందుకు వెళ్తామని పవన్ చెబితే కచ్చితంగా నాయకులలో క్యాడర్ లో కొత్త ఉత్సహాం వస్తుంది. ఒక రాజకీయ పార్టీ అందునా విపక్షంలో ఉన్న పార్టీకి ఇలాంటి విషయాలే కదా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అవన్నీ మానేసి వైసీపీ మీద అక్కసుతోనో మరోటో మనసులో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతుంది అని చెప్పడానికి అన్నట్లు ఇన్ని సీట్లు వస్తున్నాయని చెబితే జనసేన ఎందుకు పండగ చేసుకోవాలి. ఆ పార్టీ వారు ఎందుకు మిఠాయిలు పంచుకోవాలి.

మరి రాజకీయాల్లో చాలా కాలంగా ఉంటూ వస్తున్న పవన్ కి ఈ విషయాలు తెలియవా. సరే పవన్ వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పారు. అదే నోటితో టీడీపీకి ఇన్ని సీట్లు వస్తాయని ఎందుకు చెప్పలేదు అన్నది కూడా ఇపుడు ప్రశ్నగా ఉంది మరి. అంటే వన్ సైడెడ్ గా మాట్లాడుతూ పవన్ తన అధినాయకత్వంలో పార్టీకి సరైన దిశానిర్దేశం చేస్తున్నారా అన్నదే ఒక సందేహం.

పవన్ లో ఇంకా రాజకీయ పరిపక్వత రావాలి అన్న దానికి కూడా ఈ స్టేట్మెంట్స్ ఉదాహరణగా నిలుస్తున్నాయి. లేకపోతే తన పార్టీ మీటింగులో ప్రత్యర్ధి పార్టీల గురించి మాట్లాడకూడదా అంటే మాట్లాడవచ్చు, అలాగే ఘాటు విమర్శలు చేయవచ్చు. అయితే మొత్తం స్పీచ్ లో వాటి భాగం తక్కువ ఉండాలి. అదే టైం లో ఎక్కువ సేపు తన పార్టీ గురించి చెప్పుకుంటే రేపటి రోజున తన పార్టీ ఎదిగేందుకు అవకాశం ఉంది అని అంటున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ చూపు వైసీపీ నుంచి బయటకు ఎవరైనా వస్తే చేర్చుకోవాలన్న దాని మీద ఉంది అంటున్నారు. ఈ విధంగా అధికార పార్టీ ఓడిపోతుంది. మరి గెలవదు అంటే చాలా మంది వైసీపీ నాయకులు జాగ్రతపడతారు. అలాగే వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కని వారు కూడా బయటకు వస్తే తన పార్టీలోనికి చేర్చుకోవాలని కూడా పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

సరే ఈ తరహా రాజకీయ వ్యూహాలు మంచివే. ఏ రాజకీయ పార్టీకైనా ఇలాంటి వ్యూహాలు ఉండాల్సిందే. కానీ ముందు తన పార్టీ రాజకీయ జనాలలో బలంగా చూపించుకోవాలి కదా. వచ్చే ఎన్నికల్లో మేము గెలుస్తున్నామని చెబితే జనాలు ఈ వైపు చూస్తారు కానీ మీ పార్టీ ఓడుతోంది అని చెబితే అది చిలకజోస్యం అవుతుంది. అపుడు వారికి ఈ చిలకజోస్యం మీద గురి కుదిరినా గెలిచే మరో పార్టీని చూసుకుంటారు కానీ జనసేన వైపు రారు కదా. మరి ఇంత చిన్న లాజిక్ మిస్ అవుతున్న పవన్ వారంతపు సభలూ సమావేశాల ద్వారా ఏమి సాధించినట్లు అన్న ప్రశ్నలు తలెత్తితే కాస్తా ఆలోచించుకోవాల్సిందే కదా.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.