Begin typing your search above and press return to search.

మోడీ సభకు పవన్ వస్తున్నారా.. ?

By:  Tupaki Desk   |   8 Nov 2022 10:00 AM IST
మోడీ సభకు పవన్ వస్తున్నారా.. ?
X
విశాఖలో ఈ నెల 11, 12 తేదీలలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఆయన టూర్ సక్సెస్ చేయడానికి అటు బీజేపీ ఇటు వైసీపీ రెండూ కూడా శాయసక్తులా కృషి చేస్తున్నాయి. మోడీ సభకు లక్షలాది మంది జనాలను తరలిస్తామని వైసీపీ అంటూంటే రోడ్ షోతో అదరగొడతామని బీజేపీ చెబుతోంది. ఈ నెల 11న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మోడీ విశాఖ వస్తున్నారు. ఆయన ఈ నెల 12న విశాఖలోని ఏయూ సభాస్థలి వద్ద ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు.

మోడీ ఒక రాత్రి విశాఖలో బస చేస్తున్నారు. దాని కోసం తూర్పు నావికాదళం గెస్ట్ హౌస్ సిద్ధంగా ఉంది. మోడీ కొన్ని గంటల పాటు విశాఖలో ఉంటారు. ఆయన అధికారిక పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. అదే సమయంలో విశాఖ టూర్ లో మోడీ ఎవరెవరిని కలుస్తారు, ఎవరికి అపాయింట్మెంట్స్ ఇచ్చారు అన్నది అయితే తెలియరావడంలేదు.

ప్రధానికి స్వాగతం పలకడానికి కొద్ది గంటల ముందే విశాఖకు చేరుకోనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాత్రికి ప్రధాని తో ప్రత్యేక అపాయింట్మెంట్ తీసుకుని భేటీ అవుతారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇక్కడ మరో విషయం కూడా తెలుస్తోంది. బీజేపీకి మిత్ర పక్షంగా జనసేన ఉంది. అధినేత పవన్ కళ్యాణ్ ప్రధానితో భేటీ కాబోతున్నారు అన్న ప్రచారం అయితే సాగుతోంది.

ఆ మేరకు ఆయనకు ప్రధాని ఆఫీస్ నుంచి అపాయింట్మెంట్ ఉందా లేదా అన్నది అయితే ఇప్పటికి తెలియడంలేదు. ఇక ప్రధాని టూర్ మొత్తం అటు బీజేపీ ఇటు వైసీపీ మాత్రమే చూసుకుంటున్నాయి. బీజేపీ జనసమీకరణను చేస్తామని అంటోంది. సోము వీర్రాజు విశాఖలోనే విడిది చేసి మరీ ప్రధాని టూర్ అంతా చూస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని సభకు మిత్రపక్షం అయిన జనసేనను పిలుస్తున్నారా అన్న ప్రశ్నకు మాత్రం బీజేపీ నేతల నుంచి జవాబు రావడంలేదని అంటున్నారు.

జనసేన మిత్రపక్షంగా ఉంది. అలాంటి పార్టీని కూడా కలుపుకుని ప్రధాని సభను జయప్రదం చేయాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది. కానీ బీజేపీ సొంతంగానే తన భుజాలకు మోడీ టూర్ బాధ్యతలు ఎత్తుకుంది. ఏపీలో అధికారంలో ఉన్నామని చెబుతూ వైసీపీ కూడా జోరు చేస్తోంది. మరి మిత్రపక్షం అని పదే పదే జనసేన గురించి చెప్పుకునే బీజేపీ ఇపుడు ఆ ఊసు మరచిందా అన్నదే చర్చగా ఉంది.

ప్రధాని సభ అంటే అది అధికారిక సభ. అందులో పాలుపంచుకోవడానికి అన్ని రాజకీయ పక్షాలను పిలవాలి. అయితే టీడీపీని పిలవరు అన్నది తేలిపోతున్న విషయం. ఇప్పటికే చంద్రబాబు 11, 12 తేదీలలో కర్నూల్ టూర్ ని పెట్టుకున్నారు. చివరి నిముషంలో పిలిస్తే అచ్చెన్నాయుడునే పంపుతారు అని అంటున్నారు.

మరి జనసేనను కూడా చివరి నిముషంలో పిలుస్తారా పిలిస్తే పవన్ వస్తారా లేక ప్రధాని మోడీ స్వయంగా అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనతో భేటీ అవుతారా ఇవన్నీ ప్రశ్నలే. మొత్తానికి మోడీ విశాఖ టూర్ లో కూడా జనసేనాని కనిపించకపోతే మాత్రం అనధికారికంగా ఈ రెండు పార్టీల బంధానికి బీటలు వారినట్లే అనుకోవాలి అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.