Begin typing your search above and press return to search.

తిరుప‌తిలో ప‌వ‌న్ ప‌రువు పోయిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   15 April 2021 11:38 AM GMT
తిరుప‌తిలో ప‌వ‌న్ ప‌రువు పోయిన‌ట్టేనా?
X
2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీచేసిన‌ రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో.. ప‌వ‌న్ స‌త్తా ఏంటో తేలిపోయింద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక‌, రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేస్తాడ‌ని కూడా అనుకున్నారు. కానీ.. ఓడిపోయినా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉండ‌డంతో.. జ‌నాల్లో స‌దాభిప్రాయం ఏర్ప‌డుతూ వ‌చ్చింది. కానీ.. బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డంతో మ‌ళ్లీ వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తూ వ‌చ్చింది.

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఇవ్వాల్సిన హ‌క్కుల‌ను కాల‌రాసిన‌ప్పుడు జ‌న‌సేనాని మౌనం వ‌హించారు. ఆంధ్రుల హ‌క్కుగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటు వారికి క‌ట్ట‌బెట్టేందుకు నిర్ణ‌యించిన‌ప్పుడూ వ్య‌తిరేకించ‌క‌పోగా.. స‌మ‌ర్థించారు. ఇలాంటి కార‌ణాల‌తో ప‌వ‌న్ పై వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచాయి. జాతీయ పార్టీ అండ‌గా ఉంటే ఏం ఒన‌గూరుతుంద‌ని ప‌వ‌న్ భావించారో గానీ.. బీజేపీతో పొత్తువ‌ల్ల ప‌వ‌న్ ప‌రువు పోయే ప‌రిస్థితి వ‌చ్చింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

నిజానికి ఏపీలో బీజేపీ బ‌లం అత్య‌ల్పం. ఆ పార్టీకి 2 శాతం కూడా ఓటు బ్యాంకు లేదు. కానీ.. ప‌వ‌న్ పార్టీకి 6 క‌న్నా ఎక్కువ శాత‌మే బ‌లం ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ ఓ మోస్త‌రుగా పంచాయ‌తీల‌ను ద‌క్కించుకుంది. కానీ.. బీజేపీ పెద్ద‌గా ఖాతా తెరిచిన దాఖ‌లాలు క‌నిపించ‌లేదు. దీంతో.. బీజేపీ బ‌ల‌గం ఏపాటిదో అర్థ‌మైపోయింది.

అయిన‌ప్ప‌టికీ.. తిరుప‌తిలో బీజేపీ అభ్య‌ర్థినే ఉమ్మ‌డిగా నిల‌బెట్టారు. ప‌వ‌న్ క్రేజ్ తోపాటు, ఆయ‌న సామాజిక వ‌ర్గం క‌లిసి వ‌చ్చి, రెండో స్థానం సాధిస్తే.. రాష్ట్రంలో తామే ప్ర‌త్యామ్నాయం అని చాటుకోవ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. అందువ‌ల్ల.. ఈ ఎన్నిక‌ను మొత్తం ప‌వ‌న్ భుజాల‌పైనే పెట్టాల‌ని బీజేపీ ప్లాన్‌వేసింద‌ని కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకే.. సీఎం అభ్య‌ర్థి అని కూడా ప్ర‌క‌టించార‌ని చెప్పుకుంటున్నారు.

తిరుప‌తి స‌భ‌లో త‌మ్ముడు ప‌వ‌నే త‌న‌ను గెలిపిస్తాడంటూ అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ చెప్ప‌డం కూడా గ‌మ‌నించాల్సిన అంశం. అయితే.. ప‌వ‌న్ ముందుప‌డిన‌ప్ప‌టికీ.. తిరుప‌తిలో బీజేపీకి డిపాజిట్ కూడా ద‌క్కే ప‌రిస్థితి క‌నిపించ‌ట్లేదు. దీనివ‌ల్ల అన‌వ‌స‌రంగా ప‌వ‌న్ మ‌రోసారి త‌న ప‌రువు పోగొట్టుకుంటున్నాడ‌ని అంటున్నారు.

అయితే.. మ‌రో అభిప్రాయం కూడా వినిపిస్తోంది. బీజేపీ తిరుప‌తిలో ఎలాగో ఓడిపోతుంది కాబ‌ట్టి.. ఆ నింద త‌న‌పైకి రాకుండా చూసుకునేందుకే క్వారంటైన్ కు వెళ్లార‌ని కూడా అంటున్నారు. మొన్న‌టి జేపీ న‌డ్డా మీటింగ్ లో ప‌వ‌న్ లేక‌పోవ‌డంతో పేల‌వ‌గా సాగిపోయింది. ఇక‌, ప‌వ‌న్ 14 రోజుల క్వారంటైన్ ముగిసేనాటికి ఎన్నిక కూడా ముగుస్తుంది. దీంతో.. తాను ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో లేన‌ని, అందువ‌ల్ల ఆ ఓట‌మికి, త‌న‌కు సంబంధం లేద‌ని చెప్ప‌డానికే ఇలా చేశాడ‌ని కూడా అంటున్నారు.

అంతేకాకుండా.. బీజేపీతో ప‌వ‌న్ కు ఒరిగింది ఏమీ లేద‌నే అభిప్రాయం కూడా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో బ‌లంగా ఉంది. ఆ పార్టీకి క‌టీఫ్ చెప్పాల‌ని చాలా కాలంగా కోరుతున్నారు. దీనికి ఆరంభ‌మేనా అన్న‌ట్టుగా.. తెలంగాణ‌ బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రేపు తిరుప‌తి ఫ‌లితం త‌ర్వాత.. బీజేపీకి దూరంగా జ‌రుగుతారా? అనే సందేహాలు కూడా వ‌స్తున్నాయి. ఈ ప్ర‌య‌త్నంలో భాగంగానే క్వారంటైన్ పేరుతో ప‌వ‌న్ దూరంగా ఉన్నారనే అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి, ఈ తిరుప‌తి ఫ‌లితం తర్వాత బీజేపీ-జ‌న‌సేన దోస్తానా కొన‌సాగుతుందా? బీటలు వారుతుందా? అన్న‌ది చూడాలి.