Begin typing your search above and press return to search.
వైసీపీ ఎంపీ మెడలో కండువా అప్పుడే పాయే?
By: Tupaki Desk | 19 Aug 2020 12:46 PM ISTరాజకీయాల్లో విశ్వసనీయత రోజురోజుకు తగ్గిపోతుంది. నమ్మకంగా ఉండేవారు కరువు అవుతున్నారు. 2014లో వైసీపీ అధినేత జగన్ 60మందికి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే అందులో 23మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై పార్టీ ఫిరాయించారు. అందుకే 2019లో జగన్ తనకు నమ్మిన బంట్లను, యువతకు అవకాశం ఇచ్చారు. అవకాశవాదంతో రాజకీయాలను చేసేవారిని దాదాపు పక్కనపెట్టారు. తనతోపాటు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న మోపిదేవి, పిల్లి సుభాష్ లు ఓడిపోయినా సరే వారికి మంత్రి పదవులు.. రాజ్యసభ పీఠాలు ఇచ్చారు. ఎందుకంటే వారు పార్టీ మారరు.. తనవెంటే ఉన్నారన్న నమ్మకం.
అయితే రాజకీయాల్లోకి పారిశ్రామిక దిగ్గజాలు.. డబ్బున్న వారంతా వస్తే అవి మకిలి పట్టిపోతాయని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. వారు చొక్కాలు విప్పినంత ఈజీగా పార్టీలు అవసరార్థం మార్చేస్తుంటారన్న అపవాదు ఉంది. ఇప్పుడు వైసీపీకి ఆ సెగ తగులుతోంది.
దేశంలోనే అపరకుబేరుడు అయిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి ఏపీ సీఎం జగన్ ను కలిసి తన వియ్యంకుడైన పరిమల్ నత్వానీకి ఒక రాజ్యసభ సీటును ఇవ్వమని అడిగాడు. దీంతో ఏపీలో పెట్టుబడులు వస్తాయని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుదలకు అంబానీ సాయం చేస్తాడని జగన్ కూడా సరేనని ఒక రాజ్యసభ సీటును పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానికి కట్టబెట్టారు.
అయితే ఇప్పుడు రాజ్యసభలో పరిమళ్ ఖచ్చితంగా వైసీపీ రాజ్యసభ ఎంపీనే.. ప్రమాణం కూడా వైసీపీ తరుఫునే చేశాడు. కానీ ఆ ప్రమాణం మున్నాళ్ల ముచ్చటే అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే పరిమళ్ వైసీపీ కండువా కప్పుకోకుండా సొంతంగా వ్యవహరిస్తున్నారని... కండువా పక్కనపడేసి స్వతంత్య్ర ఎంపీ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫొటోలకు ఫోజుల్లో.. రాజ్యసభలో వైసీపీ కండువా లేకుండానే బిజినెస్ మ్యాన్ లా పోజిస్తున్నాడు. జగన్ నమ్మి ఇచ్చిన ఎంపీ టికెట్ తో ఎంపీ అయిన పరిమళ్ వ్యవహార శైలి ఇప్పుడు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోందట..
