Begin typing your search above and press return to search.

అప్పటి తప్పు చినజీయర్ ను ఇప్పుడు కూడా వెంటాడటమా?

By:  Tupaki Desk   |   18 March 2022 6:13 AM GMT
అప్పటి తప్పు చినజీయర్ ను ఇప్పుడు కూడా వెంటాడటమా?
X
కర్మకు మించిన ఖర్మ ఉండదనే అంటారు. అందుకు తగ్గట్లే చినజీయర్ ఉదంతం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఖర్మ కాకపోతే ఏంటి? అప్పుడెప్పుడో పది.. పన్నెండేళ్ల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేయటం ఏమిటి? అవిప్పుడు అనూహ్యంగా సోషల్ మీడియాను ముంచెత్తటం.. ఒక్కసారిగా మనోభావాలు దెబ్బ తిన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కస్సుమనటం ఏమిటి? నిన్నటి వరకు స్వాములోరు అంటూ కీర్తించినోళ్లు సైతం.. మా దేవతల్ని కించపరుస్తావా? నీకెంత ధైర్యం? అంటూ నినదిస్తున్నారు. ఆయన మూలాల్ని ప్రస్తావిస్తూ విరుచుకుపడుతున్నారు.

ఇదంతా ఎలా సాధ్యమవుతోంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి కొందరు రోటీన్ కు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. ఈ వాదన మీడియాలో అస్సలు కనిపించదు. సోషల్ మీడియాలోనూ అంత తేలికైన విషయం కాదు. కానీ.. రాజకీయ.. వ్యాపార రంగాలకు చెందిన అత్యుత్తమ స్థాయికి చెందిన వారి మాటల్లో వస్తున్న కొత్త వాదన విన్నప్పుడు.. నిజమే కదా? అన్న భావన కలుగుతుందన్న మాట వినిపిస్తోంది.

ఎవరెన్ని చెప్పినా చినజీయర్ సైతం మనలాంటి రక్త మాంసాలున్న మనిషే. ఆయనకు మనలానే గుండె కొట్టుకోవటం.. మెదడు పని చేయటం లాంటివి చేస్తుంటాయి. కాకుంటే.. అధ్యాత్మిక రంగంలో ఉండటం.. అందుకు తగ్గట్లే ఆయన మాటలు వచ్చినంతవరకు ఓకే. అందుకు భిన్నంగా ఆయన చేసే తప్పులకు కర్మ ఫలాన్ని అనుభవించకుండా ఉండలేరు. మొన్నటికి మొన్న సమతామూర్తి పేరుతో భారీ బంగారు రామానుజుడి విగ్రహాన్ని ఆవిష్కరించటమే కాదు.. 108 దేవాలయాల్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయటం ద్వారా.. ముచ్చింతల్ ను ఒక భారీ అధ్యాత్మిక కేంద్రంగా సిద్ధం చేశారు.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. సమతామూర్తిని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దొర్లిన తప్పులకు చినజీయర్ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అంతేకాదు.. ఆయన కనుసన్నల్లోనే సిద్ధమైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో జరిగిన తప్పులు కూడా ఆయనపై ఇలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయన్న మాట వినిపిస్తోంది. సమతామూర్తి విగ్రహాన్ని ప్రారంభించిన సమయంలో.. నిర్వహించిన క్రతువులు సరిగా జరగలేదని.. దాని దుష్ప్రభావమే చినజీయర్ ను వెంటాడుతోందంటున్నారు. అంతేకాదు.. యాదాద్రి మూలవిరాట్టును చెక్కిన వైనంలో చినజీయర్ కు అంతో ఇంతో వాటా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు.

ఈ తప్పులే చినజీయర్ ను వెంటాడుతున్నాయని.. ఈ రోజున ఆయన ఆత్మరక్షణలో పడిపోవటంతో పాటు.. గతంలో తాను చెప్పిన మాటలకు మూల్యం చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇందులో నిజం కంటే ఊహే ఎక్కువగా ఉందని చెప్పాలి. కాబట్టి.. వీరి వాదనను పూర్తిగా నిజమని చెప్పలేం. అదే సమయంలో మరికొందరి వాదన వాస్తవికతకు దగ్గరగా ఉంది. అదేమంటే.. ఆధ్యాత్మిక వేత్తలకు ఉండాల్సిన కనీస లక్షణాలు చినజీయర్ లో మిస్ అయినట్లుగా మండిపడుతున్నారు.

అయినా.. ఒక సన్యాసికి కోపం.. ఆసూయ.. ద్వేష భావం అన్నది ఉండకూడదు. కానీ.. సమ్మక్క.. సారలమ్మలను కొలిచే భక్తులను గౌరవించాలన్న భావన లేని చినజీయర్ ఒక అధ్యాత్మిక వేత్తగా ఎలా పరిగణలోకి తీసుకుంటాం? అన్న ప్రశ్న సరైనదని చెప్పక తప్పదు. అప్పుడెప్పుడో ఒక టీవీ చానల్ లో సమ్మక్క సారలమ్మలను ఉద్దేశించి చినజీయర్ స్వామి వ్యాఖ్యలు చేస్తూ.. "వాళ్లు దేవతలు కారు. అసలు సమ్మక్క.. సారలమ్మలు ఎవరు? వారేం దేవతలు? బ్రహ్మలోకం నుంచి దిగొచ్చిన వారా? వారి చరిత్ర ఏమిటి? వారు ఏదో గ్రామ దేవతలు. కానీ.. చదువుకున్న వారు.. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా నమ్ముతున్నారు. ఆ పేరుతో బ్యాంకులు కూడా పెట్టేశారు. అది ప్రస్తుతం వ్యాపారమైంది" అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్ వైరల్ గా మారి ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.