Begin typing your search above and press return to search.

ఆ చిన్న వీడియోకే అంతలా ఆలోచించుడా తమ్ముళ్లు?

By:  Tupaki Desk   |   30 Sept 2020 3:20 PM IST
ఆ చిన్న వీడియోకే అంతలా ఆలోచించుడా తమ్ముళ్లు?
X
టాలీవుడ్ హీరో కమ్ నారావారి కుటుంబ సభ్యుడు నారా రోహిత్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. చంద్రబాబు సొంత సోదరుడి కుమారుడైన నారా రోహిత్ తాజాగా చేసిన ఒక వీడియో కొత్త చర్చకు తెర తీసింది. తెలుగుదేశం పార్టీలో ఉంటూ.. అవసరమైన ప్రతిసారీ తన వాణిని పరిమితంగా విధించే అలవాటున్న రోహిత్.. తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు.

అందులో అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తలసేమియా రోగుల కోసం మెగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘‘మన తెలంగాణ తెలుగుదేశం ఫ్యామిలీ మెంబర్లు అంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా విషయంలో కేర్ పుల్ గా ఉంటూ ఈ క్యాంప్ ను విజయవంతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. ఈ వీడియోతో రోహిత్ కు సంబంధించి కొత్త చర్చ మొదలైంది.

నారా రోహిత్ టీటీడీపీ పగ్గాలు అందుకోనున్నట్లుగా చర్చ మొదలైంది. తెలంగాణలో లేని పార్టీకి పగ్గాలు చేపట్టేందుకు నారా రోహిత్ ఏమైనా అమాయకుడా? అని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు..చిత్తూరు జిల్లా నేపథ్యం ఉన్నప్పుడు ఎంత హైదరాబాద్ లో పెరిగినప్పటికీ.. తెలంగాణ వ్యక్తిగా గుర్తించే అవకాశం ఎంతన్నది పెద్ద ప్రశ్న.

తెలంగాణలో ఇప్పటికే నీరసించిన పార్టీని ఉత్తేజితం చేయటం కోసం నారా రోహిత్ ను ఎంపిక చేయాలనుకోవటానికి మించిన తప్పు మరొకటి ఉండదంటున్నారు. సినీ హీరో అన్న ఇమేజ్ ఒక్కటి సరిపోదు. రోహిత్ కు పార్టీ పగ్గాలు అప్పజెబితే.. ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వచ్చే వీలుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు అలాంటి సాహసం చేసే అవకాశం లేదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.