Begin typing your search above and press return to search.

అడుగుపెట్టాలంటేనే భయపడిపోతున్నారా ?

By:  Tupaki Desk   |   17 Dec 2021 8:11 AM GMT
అడుగుపెట్టాలంటేనే భయపడిపోతున్నారా ?
X
రాష్ట్రంలోకి అడుగుపెట్టాలంటేనే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు భయపడిపోతున్నారా ? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. తిరుపతిలో జరిగే అమరావతి జేఏసీ బహిరంగ సభకు హాజరవ్వాలని ఉన్నా కొడతారన్న భయం వల్లే తిరుపతికి వెళ్ళలేక పోతున్నట్లు పాపం రాజుగారు వాపోయారు. తాను తిరుపతి సభకు హాజరైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి మనుషులు తనపై దాడులు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందిందన్నారు.

తాజా మాటలు చూసిన తర్వాత ఏపిలోకి అడుగుపెట్టాలంటేనే ఎంపీ ఎంతలా భయపడిపోతున్నారో అర్ధమైపోతోంది. జగన్మోహన్ రెడ్డితో చెడిన తర్వాత పార్టీతో పాటు ఎంపీ పదవికి రాజీనామాలు చేసేసుంటే మర్యాదగా ఉండేది. అలా కాదని ప్రభుత్వంపైనే కాకుండా వ్యక్తిగతంగా జగన్ పైన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ ను అదేపనిగా విమర్శించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

జగన్ బెయిల్ రద్దు చేయాలంటు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. కేసుల విచారణలో జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేట్లు ఆదేశాలివ్వాలంటు కోర్టులో కేసులు వేశారు. నిజానికి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలనే సీఎంను ఇబ్బంది పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఒకసారి హైదరాబాద్ కు వచ్చినపుడు సీఐడీ పోలీసులు అరెస్టు చేసి విచారణకు తీసుకెళ్ళిన విషయం తెలిసిందే.

విచారణ సందర్భంగా జరిగిన వివాదం తర్వాత ముందు హైదరాబాద్ కు తర్వాత ఢిల్లీకి ఎంపీ వెళ్ళిపోయారు. అప్పటినుండి మళ్ళీ ఏపీకి కాదు కదా హైదరాబాద్ లో కూడా అడుగుపెట్టలేదు. నరసాపురం నియోజకవర్గాన్ని అయితే రాజుగారు ఎప్పుడో మరచిపోయారు. ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపటంలో తప్పేలేదు. కానీ ఎంపీ మాత్రం తన హద్దులు దాటిపోయి వ్యవహరిస్తున్నారు. దాంతో ఎంపీపై అధికార పార్టీ నేతలు మండిపోతున్నారు.

రాజుగారి ప్రస్తుత భయానికి అర్ధమేలేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎంపీపై అధికార పార్టీ నేతలెవరు దాడిచేయలేదు. అయితే వైసీపీ ఎంపీలు గోరంట్ల మాధవ్, నందిగం సురేష్ తనను చంపేస్తానంటు బెదిరించారని, బూతులు తిట్టారంటు రాజు పై ఇద్దరు ఎంపీలపై ఫిర్యాదులు చేశారు. మొత్తానికి వైసీపీ నేతలంటే భయపడుతున్న తిరుగుబాటు ఎంపీ తన నోటిని అదుపులో పెట్టుకుంటే అసలు సమస్యే ఉండదు కదా.