Begin typing your search above and press return to search.

కరిగిపోతున్న మోడీ ప్రభ... అందుకే అలా...?

By:  Tupaki Desk   |   19 Aug 2022 2:30 PM GMT
కరిగిపోతున్న మోడీ ప్రభ... అందుకే అలా...?
X
నా చాతి సువిశాలమైనది అని దేశానికి అసలు సిసలు ధైర్యం తానేనని చెప్పుకునే నరేంద్ర మోడీ రాజకీయ ప్రభకు మెల్లగా మసకబారుతోందా అన్న చర్చ జాతీయ స్థాయిలో బయల్దేరింది. మోడీ అంటే మొనగాడు అని అర్ధం వచ్చేలా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మోడీ ఒక్కరు చాలు ఈ దేశాన్ని, 140 కోట్ల మంది ప్రజానీకాన్ని ఒక కాపు కాస్తారని కూడా నమ్మబలికారు. కానీ వెనక్కి తిరిగి చూస్త గత ఎనిమిదేళ్ల మోడీ జమానాలో దేశం ఎన్నడూ లేనంతంగా దిగజారింది అని గణాంకాలు చెబుతున్నారు. అరవై లక్షల కోట్ల అప్పుతో యూపీఏ సర్కార్ 2014లో దిగిపోతే 2022 నాటికి మోడీ ఏలుబడిలో దేశానికి ఉన్న అప్పులు 140 లక్షల కోట్లు అని చెబుతున్నారు. అంటే మూడు రెట్లు అప్పులు చేసి దేశ ఆర్ధిక వ్యవస్థను పతనం చేయడమేనా అభివృద్ధి అన్న వారూ ఉన్నారు.

ఇక మోడీలో అభద్రతాభావం అలా వెల్లువలా పెరిగిపోతోంది అని అంటున్నారు. మోడీ తన నీడను కూడా నమ్మలేకపోతున్నారా అంటే ఇటీవల బీజేపీ పార్లమెంటరీ బోర్డు పునర్ వ్యవస్థీకరణ చేసినపుడు ఆరెస్సెస్ మూలాలు ఉంటూ పాలకులుగా దక్షులుగా పేరు తెచ్చుకున్న ముగ్గురు ప్రముఖ బీజేపీ నాయకులకు అక్కడ చోటు దక్కకపోవడం చర్చనీయాంశం అయింది. యోగీ ఆదిత్యనాధ్ యూపీ లాంటి పెద్ద రాష్ట్రానికి రెండవమారు సీఎం గా ఉన్నారు. మంచి మెజారిటీతో ఆయన గెలిచారు. ఆయనకు చోటు లేదు.

మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ మంచి పాలకుడిగా ఉన్నారు. ఆయన ప్రధాని పదవికి పోటీదారుగా ఉన్నారన్న వార్తలు ఉన్నాయి. ఆయన పేరు కూడా బీజేపీ బోర్డులో లేకుండా చేశారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక మూడవది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆయన్ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేసారు. అలాంటి ఆయన పేరు లేకపోవడం అంటే నిజంగా మోడీ ఈ ముగ్గురు నేతలను చూసి బెంగపెట్టుకుంటున్నారా అని కూడా చర్చ సాగుతోంది.

ఇక బీహార్ సీఎం గా ఉన్న నితీష్ కుమార్ ఈ మధ్యనే ఎన్డీయేకు గుడ్ బై చెప్పి విపక్ష శిబిరంలో చేరడం నిజంగా మోడీకి పెను విపత్తు అని అంటున్నారు. నితీష్ కి మంచి పేరుంది. బలమైన బీసీ నేతగా గుర్తింపు ఉంది. ఆయన ఉత్తరాదిన పెద్ద రాష్ట్రం అయిన బీహార్ నుంచే మోడీకి సవాల్ విసురుతున్నారు. ఇక ఆయన విపక్ష శిబిరంలో చేరడంతో మోడీకి గట్టి పోటీ తప్పదు అన్న వాదన కూడా ఉంది. దాంతో ఉత్తరాదిన బీజేపీ అవకాశాల మీద మోడీ ఇమేజ్ మీద కూడా చర్చ అయితే జోరుగా సాగుతోంది.

ఇవన్నీ ఇలా ఉంటే తమిళనాడుకు చెందిన ఆర్ధిక మంత్రి పీటీఆర్ మోడీది అంతా సొంత ప్రచార పటాటోపం తప్ప అంతర్జాతీయంగా మోడీకి అంత సీన్ లేదని గాలి తీసేశారు. ఇది నిజంగా మోడీ భక్తులకు షాకింగ్ పరిణామమే. మోడీది అంతా ఉత్త ప్రచారమే అని ఆయన చెప్పడం ద్వారా ప్రధాని ఇమేజ్ కే తూట్లు పొడిచారు అని భావించాలేమో. ఇలా చూస్తూ ఉంటే మోడీకి ఇంటా బయటా శతృవులు పెరిగిపోతున్నారు.

ఒకనాడు మోడీని అనాలంటే ఆలోచించేవారు కూడా ఇపుడు గట్టిగానే బాణాలు వేస్తున్నారు. నితీష్ కుమార్ వంటి వాతు ఎన్డీయేని వీడి మంచి పనిచేశాను అంటున్నారు అంటే మోడీ గాలులకు కాలం చెల్లిందన్న అభిప్రాయం బలపడబట్టే అని అంటున్నారు. ఈ పరిస్థితులను చూసే బీజేపీ బోర్డులో తనకు పోటీ వచ్చే సొంత పార్టీ పోటీదారులను మోడీ జాగ్రత్తగా తప్పించేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. ఏది ఏమైనా మోడీ రాజకీయ వైభవం 2024లో ముగుస్తుందా అంటే విపక్షలౌ అయితే ధీమాగా ఉన్నాయి. మరి ఏదైనా అద్భుతం జరిగితేనే మూడవసారి మోడీ ప్రధాని అయ్యేది అని కూడా అంటున్నారు.