Begin typing your search above and press return to search.

చైనా విషయంలో నెహ్రూ బాటలోనే మోడీ?

By:  Tupaki Desk   |   12 Sept 2020 2:40 PM IST
చైనా విషయంలో నెహ్రూ బాటలోనే మోడీ?
X
కొంతకాలంగా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చైనా పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడడంతో భారత సైన్యం కూడా దీటుగా జవాబిస్తోంది. `హిందీ-చీనీ భాయీ భాయీ' నుంచి చైనా సై అంటే సై అనే రేంజ్ కి పరిస్థితులు మారాయి. గత 45 ఏళ్లుగా ఇండో-చైనా సరిహద్దులో ఒక్క తూటా కూడా పేలలేదు. కానీ, ఇటీవల ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో చైనా విషయంలో నెహ్రూ చేసిన పొరపాటును నేటి ప్రధాని మోడీ కూడా చేస్తున్నారా అన్న అభిప్రాయాలను అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

భారత్, చైనా తమ స్వాతంత్ర్యాన్ని వేర్వేరు పద్ధతుల్లో సంపాదించాయని నెహ్రూ తెలుసుకోలేకపోయారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మావో కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు పూర్తిగా భిన్నంగా ఉండేవని, నెహ్రూ బ్రిటిష్ భౌగోళికవ్యూహం భావనను అంగీకరించారని చెబుతున్నారు. నెహ్రూను బూర్జువా జాతీయవాద నాయకుడుగా భావించిన చైనా., నెహ్రూను మధ్యస్థాయి సోషలిస్టు నేతగా కూడా అనుకోలేదని అంటున్నారు. ‘‘హిందీ చీనీ భాయీ భాయీ’ నినాదం వెనుక ఏం జరుగుతోందో నెహ్రూకు తెలీదని చెబుతున్నారు. 1958లో చైనాతో సరిహద్దు వివాదాల పై అప్రమత్తంగా ఉండాలని నెహ్రూను మయన్మార్ మాజీ ప్రధానమంత్రి బా స్వే హెచ్చరించారని చెబుతున్నారు. చైనాతో ఉన్న సరి హద్దులను భారత్ చరిత్రక ఆధారాలు చూపించి సమర్థించుకోడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు, చైనా యుద్ధానికి సిద్ధమైందని, ఆ విషయాన్ని నెహ్రూ గుర్తించ లేక పోయారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే 1962 లో చైనాతో యుద్ధం జరిగిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే నెహ్రూ చేసిన తప్పుల నుంచి ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని రక్షణ నిపుణుడు రాహుల్ బేడీ వ్యాఖ్యానించారు. చైనా లద్దాఖ్‌లో చాలా చేస్తోందని, చాలా చేయబోతోందని మోదీ ప్రభుత్వానికి నిఘా సమాచారం అందినా స్పందించలేదని చెప్పారు. చైనా సైనికులు మన ప్రాంతంలోకి ఎలా చొరబడ్డారన్న ప్రశ్న చాలామంది వేశారని, కానీ, చైనా భారత్ కు నమ్మకమైన స్నేహితుడు అనే భావనలో మోడీ ఉన్నారని చెప్పారు. చైనాకు సీపీఈసీ చాలా ముఖ్యమని, అందుకే. లద్దాఖ్ లో పక్కా ప్లాన్ ప్రకారం పాగా వేసిందని అంటున్నారు. ఎల్ఏసీని మరింత స్సష్టం గా నిర్ధారించాలని, సరిహద్దుల్లో శాశ్వత పరిష్కారం జరగాలని చైనా ఎప్పుడూ కోరుకోదని అంటున్నారు. అయితే, గత ప్రభుత్వాలతో పోలిస్తే చైనా తో సరిహద్దు ప్రాంతం లో మౌలిక సదుపాయాల గురించి మోడీ ప్రభుత్వం చాలా బాగా పనిచేసిందని అంటున్నారు. చైనా చొరబాట్లకు దీటుగా మోడీ ప్రభుత్వం సైన్యాన్ని, యుద్ధ విమానాలను కూడా మోహరించడం మంచి పరిణామాలని అభిప్రాయపడుతున్నారు.