Begin typing your search above and press return to search.

ద్రౌపదికి బంపర్ మెజారిటి ఖాయమా?

By:  Tupaki Desk   |   15 July 2022 1:30 PM GMT
ద్రౌపదికి బంపర్ మెజారిటి ఖాయమా?
X
ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు బంపర్ మెజారిటి ఖాయమని అర్ధమైపోతోంది. ఎన్డీయే అభ్యర్ధికి దీటుగా నాన్ ఎన్డీయే పార్టీల తరపున కూడా బలమైన అభ్యర్ధిని పోటీకి దించాలని ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. అయితే ఎన్డీయే తరఫున అభ్యర్థి ఎవరనే విషయాన్ని నరేంద్ర మోడీ చాలా రోజులు తేల్చలేదు. దాంతో ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందని అందరు అనుకున్నారు.

అయితే ఎన్డీయే అభ్యర్థి గా ద్రౌపదిని ప్రకటించిన తర్వాత మెల్లిగా సమీకరణలు మారిపోయాయి. అప్పటివరకు ఎన్డీయేకి వైసీపీ మద్దతిస్తుందని అనుకున్నా, ఒడిస్సాలోని బీజూ జనతాదళ్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా తర్వాత మద్దతిస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో ముర్ముకు నైతిక బలం పెరిగింది. ఇదే సమయంలో జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూడా ముర్ముకు మద్దతు ప్రకటించింది. విచిత్రం ఏమిటంటే జేఎంఎం యూపీయేలో భాగస్వామ్య పార్టీ.

ఎప్పుడైతే జేఎంఎం మద్దతు ప్రకటించిందో అక్కడి నుండి అనేక పార్టీలు ద్రౌపదికి మద్దతుగా నిలబ్డడాయి. దాంతో నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బాగా బలహీన పడిపోయారు. ప్రస్తుత పరిస్దితులను జాగ్రత్తగా గమనిస్తే బీజేడీ, వైసీపీ, బీఎస్సీ, ఏఐఏడీంకే, టీడీపీ, అకాలీదళ్, శివసేన, జేఎంఎం పార్టీలు ద్రౌపదికి మద్దతు ప్రకటించాయి. దీనివల్ల నామినేషన్ల నాటికి 50 శాతం ఓట్ల మద్దతు ఇపుడు 61 శాతంకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం ఓట్ల విలువ 10,486,431. రాష్ట్రపతిగా గెలవాలంటే కనీసం 51 శాతం ఓట్లు వచ్చి తీరాలి. ఓట్ల పరంగా చూస్తే ముర్ముకు 6.67 లక్షలున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఎన్నికకు ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి ద్రౌపదికి మద్దతు ఇంకా పెరిగినా పెరగవచ్చు. మొత్తానికి 61 శాతం ఓట్ల అంచనాతో ద్రౌపది గెలవటం ఒక రికార్డవుతుందనే చెప్పాలి. గిరిజన అభ్యర్ధిని పోటీలోకి దించటమే నరేంద్ర మోడీ రాజకీయ చాతుర్యానికి నిదర్శనంగా నిలిచింది.