Begin typing your search above and press return to search.

మహారాష్ఠ్ర లో పరిస్థితి కి కుమారస్వామే కారణమా?

By:  Tupaki Desk   |   14 Nov 2019 11:31 AM IST
మహారాష్ఠ్ర లో పరిస్థితి కి కుమారస్వామే కారణమా?
X
మహారాష్ట్రలో పట్టూవిడుపుల్లేని రాజకీయం కారణంగా రాష్ట్రపతి పాలన వరకు వ్యవహారం వెళ్లింది. ఇప్పటికీ పార్టీల మధ్య పొత్తు కుదరకపోతే మళ్లీ ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. అయితే, ఈ పరిస్థితికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామే కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్ర రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని కుమారస్వామికి దీంతో ముడిపెట్టడంలో లాజిక్ చెబుతున్నారు విశ్లేషకులు. ఇంతకుముందు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినప్పుడు నామమాత్రం సీట్లు సాధించి కూడా కాంగ్రెస్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కుమార స్వామి ముఖ్యమంత్రి కాగలగడం తెలిసిందే. కుమారస్వామికి పట్టిన ఆ అదృష్టం తమకెందుకు పట్టదంటూ చాలా రాష్ట్రాల్లోని నేతలు అలాంటి ఆశలే పెట్టుకున్నారు. మహారాష్ట్రతో పాటే ఎన్నికలు జరిగిన హరియాణాలో దుష్యంత్ చౌతాలా కూడా సీఎం పదవి ఆశించినా రాజకీయ దౌత్యం ఫలించడం.. వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకుని మెట్టు దిగడం వల్ల కలిగే లాభాలను అంచనా వేసుకోవడంతో డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్నారు.

కానీ, మహారాష్ట్రలో మాత్రం తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను సీఎం చేయడం కోసం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పట్టు వదలకుండా ప్రయత్నించారు. ఎంతవరకు అంటే.. అసెంబ్లీ గడువు ముగిసిపోయే వరకు. అయినా, బీజేపీ మాత్రం ససేమిరా అంది. బీజేపీకి చాన్సున్న చోట తాము శివసేనకు మద్దతిస్తే ఇప్పటికే తమ మెడ చుట్టూ ఉన్న కేసులు మరింత బిగుసుకుంటాయేమోనని ఎన్సీపీ భయపడింది. ఫలితం.. శివసేన ఆచరించిన వ్రతం చెడింది ఫలితం దక్కలేదు.

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కుమారస్వామి ఫార్ములా తమకు కలిసొస్తుందని పలువురు నేతలు ఆశించినా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మహారాష్ట్రాలోనూ అదే రుజువైంది.