Begin typing your search above and press return to search.

'తెలంగాణ'ను తండ్రి ఖాతాలో వేస్తూ కేటీఆర్ భారీ తప్పు చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   22 April 2022 9:29 AM GMT
తెలంగాణను తండ్రి ఖాతాలో వేస్తూ కేటీఆర్ భారీ తప్పు చేస్తున్నారా?
X
నోరు ఉంది కదా అని మాట్లాడితే ఇబ్బందులే. గతంలో మాదిరి మొహమాటపు రాజకీయాలు అస్సల్లేవు. ఎవరికి వారు తగ్గేదెలే.. అంటూ చెలరేగిపోతున్నారే తప్పించి అస్సలు వెనకడుగుకు వేయటం లేదు. నువ్వు రెండు అంటే.. నేను ఇరవై అంటాననే నేతలు ఎక్కువ అవుతున్నారు. సాధారణంగా అధికారపక్షం మీద విపక్షం విరుచుకుపడటం మామూలే. విపక్షాలు చేసే విమర్శలు.. ఆరోపణలపై స్పందిస్తూ.. తమను వేలెత్తి చూపే వారిని ఇరుకున పెట్టేలా చేయటం మంచిదే. కానీ.. ఆ పేరుతో వ్యక్తిగత విమర్శలు.. తిట్లు.. బూతులు తిట్టటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.

కానీ.. అలాంటి వాటితో తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలనే ఎత్తుగడ వేస్తే ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పుడు మంత్రి కేటీఆర్ అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఆయన తెలంగాణ సాధన క్రెడిట్ మొత్తం తన తండ్రి కేసీఆర్ ఖాతాలో వేసుకుంటున్నారు.

అదేమంటే.. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కావొచ్చు.. టీ బీజేపీ అధ్యక్ష పదవి మొత్తం కేసీఆర్ భిక్షగా ఆయన అభివర్ణిస్తున్నారు. పార్లమెంటు తలుపులు మూసి.. తాను ఇవ్వాలనుకున్న తెలంగాణ కోసం సోనియమ్మ చేసిన దానితో పోలిస్తే.. కేసీఆర్ చేసిందేముంది? అంటూ ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు.

ఇంతా చేస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు మాత్రమే అయ్యింది. తనకు తోచినట్లుగా మాట్లాడినంత మాత్రాన కేటీఆర్ మాటలే నిజాలుగా తెలంగాణ ప్రజలు భావించరు కదా? అదే.. తెలంగాణ ఏర్పడి ఏ పాతిక.. యాబై ఏళ్లు అయితే అప్పటి తరానికి చాలా విషయాలు తెలిసే అవకాశం ఉండదు. కానీ.. పోరాడి సాధించుకున్న తెలంగాణకు సంబంధించి ఎప్పుడేం జరిగింది? ఎవరి పాత్ర ఎంత? తెలంగాణతో ఎవరికి న్యాయం జరిగింది? ఎవరికి అన్యాయం జరిగింది? ఎవరు భారీగా లబ్థి పొందారు? ఎవరు దారుణంగా నష్టపోయారు? తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారి తాజా పరిస్థితి ఏమిటి? తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోకుండా ఇవాల్టి రోజున కేసీఆర్ సర్కారులో పదవుల్ని అనుభవిస్తున్నది ఎవరు? లాంటి విషయాల మీద అందరికి అవగాహన ఉంది.

అలాంటి విషయాన్ని వదిలేసి.. మాట్లాడటం వచ్చు కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడటం.. అందరికి తెలిసిన నిజాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కాస్త ఎక్కువనే సత్యాన్ని ఎవరూ కాదనరు. కానీ.. కేసీఆర్ వల్ల మాత్రమే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని మనసున్న ఎవరూ ఒప్పుకోరు.

అందుకే.. తెలంగాణ సాధన క్రెడిట్ మొత్తం తండ్రి ఖాతాలో వేసే కేటీఆర్ ప్రతి ప్రయత్నంతో టీఆర్ఎస్ కు నష్టమే తప్పించి లాభం ఉండదన్న వాస్తవాన్ని మంత్రి కేటీఆర్ ఎప్పటికి గుర్తిస్తారో? అది జరగనంత కాలం.. ఆయన నోటి నుంచి మాటలు రావటం.. చావు తిట్లు తిట్టించుకోవట ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.