Begin typing your search above and press return to search.

ఏపీ నీటి చౌర్యం పేరుతో కేసీఆర్ ఆగ్రహావేశాలన్ని మైండ్ గేమ్ లో భాగమా?

By:  Tupaki Desk   |   21 Jun 2021 2:09 AM GMT
ఏపీ నీటి చౌర్యం పేరుతో కేసీఆర్ ఆగ్రహావేశాలన్ని మైండ్ గేమ్ లో భాగమా?
X
మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉందన్నప్పుడు ఏం చేస్తారు? ఒకటి.. అలా మాట అనటానికి ఉన్న అవకాశాన్ని పూర్తిగా మూసేయటం. రెండోది.. ఏం చేసినా మాట పడటం ఖాయమైనప్పుడు.. ఎంత తక్కువగా మాట పడే అవకాశం ఉందని చూడటం. మూడోది.. వాళ్లు మనల్ని అనేదేంటి? మనమే వాళ్లును ఎదురు రెండు అంటే పోలా? సరిగ్గా ఇలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది.

ఉలుకు పలుకు లేని పిడుగు మాదిరి.. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా ఏపీ సర్కారు నీటి చౌర్యం చేస్తుందంటూ సీఎం కేసీఆర్ వేసిన బండ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ నీటి చౌర్యానికి పాల్పడుతుందని.. మొండిగా అక్రమ ప్రాజెక్టులు కడుతుందంటూ కేసీఆర్ వాపోయిన తీరు చూస్తే.. ఆయన నోట్లో వేలు ఎవరైనా పెడితే.. దీన్నిప్పుడు ఏం చేయాలన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వానికైనా ఇబ్బంది అన్నంతనే.. మరో ఆలోచన లేకుండా కేసులు వేయటం.. తాఖీదులు పంపటం చేస్తున్నారు.

అవేమీ వర్కువుట్ కాకుంటే మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చేలా ప్లాన్ చేయటం లాంటివి మామూలే. అందునా.. పొరుగున ఉన్న రాష్ట్ర సర్కారు తీరుతో కోట్లాది మంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయంటే.. అధికార పార్టీ ఊరుకుంటుందా? ఆగమాగం చేయదు. మరీ.. అలాంటిదేమీ చేయకుండా.. ముందస్తుగా ఆ విషయాల్ని ప్రస్తావించని కేసీఆర్.. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏపీ జలచౌర్యం..అక్రమ ప్రాజెక్టుల పేరుతో మండిపడటం.. నిరసనలు.. ఆందోళనలు చేస్తామని హెచ్చరించటంలాంటివి చూస్తుంటే.. విస్మయానికి గురి కాక మానదు.

మైండ్ గేమ్ లో భాగంగానే సీఎం కేసీఆర్ ఇదంతా చేస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. గోదావరి జలాల్ని తాను అనుకున్న రీతిలో ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్.. ఇప్పుడు క్రిష్ణా జలాల మీద ఫోకస్ పెట్టారు. రానున్న రోజుల్లో ఆయన కొన్ని ప్రాజెక్టుల్ని తెర మీదకు తీసుకురానున్నారు. వాటిని తెచ్చిన తర్వాత కచ్ఛితంగా రాష్ట్రాల మధ్య పంచాయితీలకు తెర తీస్తుంది.

దానికి ముందే.. పక్కనున్న రాష్ట్రం తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందని.. దాని కారణంగా తమ ప్రజల ప్రయోజనాలు దెబ్బ తిన్నాయన్న వాదనను తెర మీదకు తీసుకొస్తే కలిగే ప్రయోజనాలు రెండు. అందులో మొదటిది.. ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తామన్న ఇమేజ్. రెండోది.. తాను తలపెట్టిన ప్రాజెక్టుల్లోని లోపాల్ని ఎత్తి చూపిస్తే.. అదంతా కావాలనే కోపంతో చేస్తున్నవే తప్పించి.. అందులో వాస్తవం లేదన్న భావన కలిగేలా చేయటం కోసమని చెప్పాలి.

ఇలా పక్కా మైండ్ గేమ్ తోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద సీఎం కేసీఆర్ మండిపడుతున్నారన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. ఎవరైనా ఏదైనా విమర్శ చేసినంతనే వెంటనే రియాక్టు అయ్యే గుణం సీఎం జగన్ లో తక్కువ. అందునా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు చేసినప్పుడు కామ్ గా ఉండి.. ఎప్పుడేం చేయాలో అప్పుడు దాన్ని చేయటం జగన్ కు అలవాటు. ఈ తీరును కూడా కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న యోచనలో ఉన్నట్లు చెప్పాలి.

తాను విమర్శలు చేసినంతనే.. మిగిలిన వారి మాదిరి విరుచుకుపడటం ఉండదు కాబట్టి.. మాటల్లో తనదే పైచేయి అవుతుందన్న భావనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఏపీ సర్కారు నీటిచౌర్యం..అక్రమ ప్రాజెక్టు మాటలన్ని కూడా పక్కా మైండ్ గేమ్ తప్పించి మరింకేమీ లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.