Begin typing your search above and press return to search.

సంచలన ప్రెస్ మీట్ కు రాంగ్ టైంను ఎంచుకున్న కేసీఆర్?

By:  Tupaki Desk   |   4 Nov 2022 5:33 AM GMT
సంచలన ప్రెస్ మీట్ కు రాంగ్ టైంను ఎంచుకున్న కేసీఆర్?
X
ఆచితూచి అన్నట్లుగా నిర్ణయాలు తీసుకునే అలవాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతమని చెబుతారు. ఆయనేం పని చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించటం.. తాను చేసే పనితో తనకు కలిగే లాభ నష్టాల గురించి పదే పదే ఆలోచించిన తర్వాతే.. తన ఆలోచనను అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తారు. చేసే చిన్న పని మొదలు పెద్ద పని వరకు తనదైన ఒక టీంతో అన్ని కోణాల్లో క్షుణ్ణంగా చర్చించి.. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవటం అలవాటు. ఇక్కడ ఇంకో విషయాన్ని ప్రస్తావించాలి. మిగిలిన అధినేతలకు భిన్నంగా తాను సలహాలు కోరే సమయంలో తన ఇగోను ఆయన పక్కన పెట్టేస్తారని.. తాను సలహా అడిగిన వారు చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వింటారని చెబుతారు.

అయితే.. అలా విన్న మాటల్ని అమలు చేస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే.. మనసులోనిది మొత్తం చెప్పే అవకాశాన్ని మాత్రం ఇస్తారని చెప్పక తప్పదు. ఇదే ఆయనకు ఆయుధమన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి కేసీఆర్.. దేశాన్ని ప్రభావితం చేసే ఒక సంచలన ప్రెస్ మీట్ ను ఏ సమయంలో పెట్టాలి? ఎప్పుడు నిర్వహించాలనే దానిపై రాంగ్ స్టెప్ ఎందుకు వేశారు? అన్నది ప్రశ్నగా మారింది. గురువారం ఉదయం నుంచి మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఘట్టంలో మీడియా మొత్తం ఫోకస్ పెట్టింది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ అయ్యాక.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ పూర్తి కాకపోవటంతో.. దాన్ని కొనసాగించారు.

ఆ వెంటనే.. ఎగ్జిట్ పోల్స్ హడావుడి నడుస్తోంది. ఇలాంటి వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సంచలన ప్రెస్ మీట్ ను పెట్టారు. రోటీన్ గా అయితే.. తన ప్రెస్ మీట్ లకు కొన్ని గంటల ముందే సమాచారాన్ని ఇవ్వటం చేస్తారు. తాజా ప్రెస్ మీట్ విషయంలో మాత్రం చాలా తక్కువ సమయాన్ని ఇవ్వటం గమనార్హం. అందరి చూపు మునుగోడు పోలింగ్ మీద ఉన్న వేళ.. రాత్రి 8 గంటల ప్రాంతంలో తన ప్రెస్ మీట్ షురూ చేశారు.

ఆయన ఏ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టారన్న విషయాన్ని గుర్తించి.. హడావుడిగా అలెర్టు కావాల్సి వచ్చింది. అప్పటికే అలసిన మీడియా సంస్థల ప్రతినిదులు.. కేసీఆర్ ప్రెస్ మీట్ ను తిట్టుకుంటూ కవర్ చేసే పరిస్థితి. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు ఎమ్మెల్యేల ఎర ఎపిసోడ్ కు సంబంధించిన ప్రెస్ మీట్ పెడితే.. ఈ ఎన్నికలో ప్రయోజనాన్ని పొందేందుకు అనే మాటకు అవకాశం ఉందని.. అందుకే పోలింగ్ పూర్తి అయిన వెంటనే పెట్టినట్లుగా చెప్పారు. ఇన్నాళ్లు ఆగిన పెద్ద మనిషి మరో పూట ఆగితే సరిపోయింది కదా? అన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.

తన ప్రెస్ మీట్ లో భాగంగా గంట నిడివి ఉన్న వీడియోలను విడుదల చేయటం.. వాటిని డౌన్ లోడ్ చేసుకొని.. అందులోని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి.. రాసేందుకు సమయం సరిపోక అపసోపాలు పెట్టిన పరిస్థితి. సంచలన ప్రెస్ మీట్ కు సంబంధించి భారీ మైలేజీ కోరుకునే ఆయన.. చాలా తక్కువ సమయాన్ని మీడియా హౌస్ లకు ఇవ్వటం ద్వారా.. ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.

మిగిలిన అన్ని మీడియా హౌస్ ల కంటే ప్రింట్ మీడియా హౌస్ ల వారి పరిస్థితి కేసీఆర్ కారణంగా ఆగమాగం అయిన పరిస్థితి. ఇంత హడావుడి చేసి.. ఊపిరి తీసుకోకుండా పని చేసేలా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఉందన్న వాదన వినిపిస్తోంది. రైట్ ప్రెస్ మీట్ ను రాంగ్ టైమ్ లో నిర్వహించకుండా శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలోనో.. పన్నెండు గంటల సమయంలోనో ఏర్పాటు చేసి ఉంటే.. నేషనల్ మీడియా సైతం అటెన్షన్ చూపించేందుకు అవకాశం ఉండేదంటున్నారు. అన్ని ఆలోచించే కేసీఆర్.. ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించలేదంటారు?



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.