Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డికి కౌశిక్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నాడా?

By:  Tupaki Desk   |   11 July 2021 10:18 AM GMT
రేవంత్ రెడ్డికి కౌశిక్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నాడా?
X
తెలంగాణ కాంగ్రెస్ లో సమీకరణాలు మారుతున్నాయి. కొత్తగా పీసీసీ చీఫ్ గా నియామకమైన రేవంత్ రెడ్డికి తొలి సవాల్ గా హుజూరాబాద్ మారబోతోంది. హుజూరాబాద్ కాంగ్రెస్ లో మారుతున్న పరిణామాలు రేవంత్ ను కంగారు పెడుతున్నాయి.

హుజూరాబాద్ లో పోయిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ కు గట్టి పోటీనిచ్చాడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కౌశిక్ రెడ్డి. ఓడిపోయిన సానుభూతి ఆయనపై ఉండడంతో ఈసారి బలమైన ప్రత్యర్థిగా మారాడు. నిన్నటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీచేస్తానని స్పష్టం చేసిన కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి తాజాగా మరో నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ ను వీడి అధికార టీఆర్ఎస్ లో చేరేందుకు కౌశిక్ రెడ్డి డిసైడ్ అయ్యారని.. ఈ మేరకు స్థానిక కార్యకర్తలతో నేడు సమాచారం కానున్నట్టు సమాచారం.

ఈటల రాజేందర్ రాజీనామాతో ఇప్పుడు హుజూరాబాద్ లో త్రిముఖ పోరు నెలకొంది. ఈటల బీజేపీలో చేరి పోటీ పడుతుండగా.. బలమైన కాంగ్రెస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక టీఆర్ఎస్ కు మాత్రం సరైన క్యాండిడేట్ లేకుండా పోయారు. కానీ అధికారంలో ఉండడంతో టీఆర్ఎస్ ఇక్కడ బలంగా ఉంది. మూడు పార్టీలు ఆ సీటును కైవసం చేసుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నిక రానున్న సాధారణ ఎన్నికలకు రెఫరెండంగా మారనున్న నేపథ్యంలో రెండు జాతీయ పార్టీలు ఒక స్తానిక, అధికార పార్టీలు నియోజకవర్గంలో అంతర్యుద్దాన్ని ప్రారంభించాయి. ఇందుకోసం బడా నేతలు మకాం వేసి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.

బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ ఖాయం కాగా.. అధికార టీఆర్ఎస్ ధీటైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది. పక్క పార్టీల నేతలకు గాలం వేస్తోంది. స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నాయకత్వంలో చీలకలు రావడం.. కొంత మంది ఈటల వైపు చేరడం.. మెజార్టీ నేతలను టీఆర్ఎస్ పార్టీ లాగేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.

ఇక పోయిన ఎన్నికల్లో హుజూరాబాద్లో రెండోస్థానంలో నిలిచి ఈటలకు గట్టిపోటీనిచ్చిన కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. పార్టీలో చేరాలని కేటీఆర్ ఆహ్వానించారని.. ఇటీవలే ఆయనను కలిసి కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడాడని తెలిసింది.

అన్ని ఆలోచించుకున్న కౌశిక్ రెడ్డి పార్టీ మారేందుకు డిసైడ్ అవుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈటల రాజీనామా నుంచే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ భూకబ్జా ఆరోపణలకు వంతపాడుతూ కౌశిక్ రెడ్డి ఈటలను టార్గెట్ చేయడం విశేషం. మంత్రి కేటీఆర్ ను కలిసి ముచ్చటించడం విశేషం.

దీంతో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నాడే సంకేతాలు నియోజకవర్గంలో వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తలను కౌశిక్ రెడ్డి తోసిపుచ్చాడు. తాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీచేస్తానని స్పష్టం చేస్తున్నాడు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ కు ఊపు వచ్చింది. కౌశిక్ రెడ్డిని గెలిపించడానికి రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు.

అయితే కౌశిక్ రెడ్డి మాత్రం తాజాగా అనుచరులతో భేటి కావడంతో ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్నారా? అన్న ప్రచారం జోరందుకుంది. పార్టీ మార్పుపై వారితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.

ఇక ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ వరకు కరోనా పూర్తి స్థాయిలో తగ్గుతుందని.. అప్పటికీ ఈసీ హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందని బీజేపీ నేతలు ఘంఠా పథంగా చెబుతున్నారు. దీంతో రాబోయే మూడు నెలల్లో తెలంగాణలో ఆసక్తికర రాజకీయం రంజుగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.