Begin typing your search above and press return to search.

జీవన్​ రెడ్డి అప్పుడే పీసీసీ అధ్యక్షుడిలా ఫీలవుతున్నారా?

By:  Tupaki Desk   |   9 Jan 2021 8:00 PM IST
జీవన్​ రెడ్డి అప్పుడే పీసీసీ అధ్యక్షుడిలా ఫీలవుతున్నారా?
X
తెలంగాణ సీఎం కేసీఆర్​పై కాంగ్రెస్​నేత జీవన్​రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్​ అయ్యారు. అయితే పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్​ హైకమాండ్​ జీవన్​రెడ్డి పేరును కన్​ఫార్మ్​ చేసిందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సాగర్​ ఉప ఎన్నిక తర్వాతే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామంటూ హైకమాండ్​ ప్రకటించింది. శనివారం రైతులకు మద్దతుగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్​వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నా వద్ద ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి సీఎం కేసీఆర్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతు సమస్యలపై సీఎం కేసీఆర్​ మొదట మద్దతు ఇచ్చారని .. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి పిల్లిలా మారారని విమర్శించారు. కేసీఆర్​ యూ టర్న్​ సీఎం అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్​ అయ్యారు.


హైదరాబాద్​లో కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం కేసీఆర్​.. ఢిల్లీకి వెళ్లగానే తొక ముడిచారని, సీఎం కేసీఆర్​ శిఖండిలా వెనకడుగు వేశారని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘ తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్​ జాగీరు కాదు. ఇప్పటికే గ్రామాల్లో రైతు కొనుగోలు కేంద్రాలు బంద్​ చేశారు. ఇలా అయితే టీఆర్​ఎస్​ కార్యకర్తలను ప్రజలను గ్రామాల్లో తిరగనివ్వరు. వాళ్లను తరిమి తరిమి కొడతారు.

సోనియా గాంధీ ఎక్కడ పుట్టారంటూ కొందరు నీచంగా మాట్లాడుతున్నారు. ఆమె ఎక్కడ పుట్టారన్నది అనవసరం. ఇప్పుడు ఆమె ప్రజల కోసం ఎలా పోరాటం చేస్తున్నారు? అన్నదే ముఖ్యం. సీఎం కేసీఆర్​ రైతు బంధు అంటూ ఓ మోసపూరిత పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడేమో కేంద్రంతో కుమ్మక్కై రైతులను ముంచేందుకు డిసైడ్​ అయ్యారు. కేసీఆర్​ యూ టర్న్​ సీఎం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకపోతే.. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్​ఎస్​ దుకాణం బంద్​ కావడం ఖాయం’ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఓ వైపు ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడి జీవన్​రెడ్డి పేరును ప్రకటిస్తారని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో జీవన్​రెడ్డి తాజా కామెంట్లు చూస్తుంటే ఆయనకు పదవి ఖాయమైందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.