Begin typing your search above and press return to search.

జగన్ క్రైస్తవుడు కాదా ?

By:  Tupaki Desk   |   1 Jan 2022 8:58 AM IST
జగన్ క్రైస్తవుడు కాదా ?
X
జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి జవహర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ క్రైస్తవుడు కాదట. ఎందుకంటే బైబిల్ ప్రకారం ప్రతి క్రైస్తవుడు పాటించాల్సిన పది ఆజ్ఞలను జగన్ ఏనాడు పాటించలేదట. కాబట్టే జగన్ క్రైస్తవుడు కాదనేది జవహర్ లా పాయింట్. బైబిల్ లోని ఆజ్ఞలను పాటించకోవటమే కాకుండా జగన్ ఆ ఆజ్ఞలను అపహాస్యం పాలయ్యేట్లు వ్యవహరిస్తున్నారంటు మాజీమంత్రి మండిపోయారు. అంటే జవహర్ చెప్పిన ప్రకారం చూస్తుంటే జగన్ వల్ల క్రైస్తవానికి అపచారం జరుగుతున్నట్లే అనుకోవాలి.

ఇంతకీ జగన్ వల్ల జరుగుతున్న అపచారం ఏమిటి ? ఏమిటంటే స్వామి స్వరూపానంద కాళ్ళు పట్టుకోవటం, గంగలో మునగటం, కొవ్వూరులో పిండ ప్రధానం చేయటం లాంటి అంశాలను జవహర్ ప్రస్తావించారు. జగన్ వల్ల క్రైస్తవ సమాజానికి ఎంత హాని జరుగుతోందో సమాజం తెలుసుకోవాలని మాజీమంత్రి చెప్పారు. జగన్ క్రైస్తవుడు కాదన్న సత్యాన్ని క్రైస్తవులంతా ముందు తెలుసుకోవాలని జవహర్ పిలుపిచ్చారు. జగన్ క్రిస్టియానిటీ ముసుగు మాత్రమే వేసుకున్నట్లు మాజీమంత్రి మండిపోయారు.

జగన్ కు అసలు ఏ మతం మీదా విశ్వాసం లేదని అన్ని మత ధర్మాలను కాలరాస్తున్నాడంటు చాలా ఆరోపణలే చేశారు. అసలు జగన్ క్రైస్తవం మీద ఇపుడు అర్జంటుగా ఆరోపణలు, వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం జవహర్ కు ఏమొచ్చింది ? తాను క్రైస్తవ మతోద్ధరణకే అవతరించినట్లు జగన్ ఏరోజు చెప్పుకోలేదు. మతం, విశ్వాసం, పూజలు, ప్రార్ధనలు ఎవరి వ్యక్తిగతం వారిది.

జగన్ ముఖ్యంగా రాజకీయనేత. కాబట్టి విశ్వాసం ఉండే లేకపోతే జనాల కోసమో చర్చిలు, దేవాలయాలు, దర్గాలు అన్నింటిలోకి వెళతారు. అది రాజకీయ నేతల అవసరం. చంద్రబాబునాయుడు కూడా చర్చీలకు వెళ్ళి ప్రార్ధనలు చేశారు, దర్గాల్లో ప్రార్ధనలు, దేవాలయాల్లో పూజలు చేసిన విషయం తెలిసిందే. ఇది జగన్, చంద్రబాబుకు మాత్రమే పరిమితం కాదు. రాజకీయనేతలకు అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుంది.

జనగ్ క్రైస్తవుడా, హిందువా కాదా అని జనాలు చూడలేదు. తమకు మంచి చేస్తాడా లేదా అని మాత్రమే ఆలోచించి 151 సీట్లలో గెలిపించారు. జనాల ఆలోచనలకు తగ్గట్లు పరిపాలన లేకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడించేస్తారు. అంతేకానీ క్రైస్తవుడని క్రిస్తియన్లు, హిందువని హిందువులు ఏనేతకు జనాలు ఎప్పుడూ ఓట్లేయరు. జవహర్ ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేకపోతే జనాల్లో అభాసుపాల్యేది జవహరే.