Begin typing your search above and press return to search.

రైతులను రెచ్చగొట్టిన ఫలితమేనా ?

By:  Tupaki Desk   |   13 Dec 2020 2:27 PM IST
రైతులను రెచ్చగొట్టిన ఫలితమేనా ?
X
నూతన వ్యవసాయ చట్టాల అమలు విషయంలో ఇటు రైతులకు అటు కేంద్రప్రభుత్వానికి మధ్య పీటముడి పడిన విషయం తెలిసిందే. కేంద్రం చేసిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతుసంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ దగ్గర ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై అనేక సందర్భాల్లో కేంద్రమంత్రులు మాట్లాడుతూ ఆందోళనలో పంజాబు రైతులు తప్ప ఇంకెవరు లేరంటూ కాస్త ఎగతాళిగానే మాట్లాడారు. దానికి సమాధానంగానా అన్నట్లుగా దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున రైతులు సింఘూ ప్రాంతానికి చేరుకుంటున్నారు.

కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 14వ తేదీన సింఘూ దగ్గరే ఉదయం నుండి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేయబోతున్నట్లు రైతుసంఘాల నేతలు ప్రకటించారు. ఆందోళనకు సంఘీభావంగా రాజస్ధాన్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున రైతులు ఆందోళనప్రాంతానికి చేరుకుంటున్నారు. ఆందోళనలో పంజాబ్ రైతులు తప్ప ఇంకే రాష్ట్రం రైతులు మద్దతు ఇవ్వటం లేదన్నందుకే ఇన్ని రాష్ట్రాలకు చెందిన రైతులు చేరుతున్నారని అర్ధమవుతోంది. తొందరలోనే మరిన్ని రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా తమతో కలుస్తారని రైతు నేతలు ప్రకటించారు.

చూస్తుంటే ఆందోళనకు మద్దతుగా వివిద రాష్ట్రాల్లోని రైతులు కూడా చేరుతున్నారంటే కేంద్రం రెచ్చగొట్టినందుకే అని అర్ధమవుతోంది. భవిష్యత్తులో చేయబోయే ఆందోళనల్లో తమ భార్యలు, బిడ్డలు కూడా పాల్గొంటారని రైతులు చెప్పటం చూస్తుంటే రైతుసంఘాలు కేంద్రాన్ని ఓ పట్టాన వదిలిపెట్టేట్లుగా లేదనే అనిపిస్తోంది.

ఇతర ప్రాంతాల నుండి సింఘూకు వస్తున్న రైతుల కారణంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పెద్దఎత్తున పోలీసు బలగాలు కూడా చేరుకుంటున్నాయి. ముందు జాగ్రత్తగా రోడ్లపై బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండే కాక కేంద్ర బలగాలను కూడా తెప్పిస్తున్నారు.