Begin typing your search above and press return to search.

మోడీ రూల్ చాలామంది నేతలకు అస్సలు నచ్చటం లేదుగా?

By:  Tupaki Desk   |   17 Jan 2021 8:25 AM IST
మోడీ రూల్ చాలామంది నేతలకు అస్సలు నచ్చటం లేదుగా?
X
మాటలు ఎన్నైయినా చెప్పొచ్చు. చేతల వరకు వెళ్లినప్పుడే కదా అసలు విషయం ఏమిటో అర్థమయ్యేది. కరోనా మహమ్మారికి మంగళం పాడేందుకు వీలుగా.. వ్యాక్సిన్ రావటం.. శనివారం దేశ వ్యాప్తంగా నిర్దేశించిన వారికి టీకాలు ఇవ్వటం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా దేశంలోని ఎందరో ప్రజాప్రతినిధుల చేతుల్ని కట్టేసి.. తమ సాహసాన్ని.. దమ్మును ప్రదర్శించే అవకాశం లేకుండా చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎందుకు చేశారో తెలీదు కానీ.. ఆయన నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా చాలామంది నేతలు తెగ ఫీల్ అవుతున్నారు.

ఎవరిదాకానో ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ విషయానికే వద్దాం. తొలి టీకా నేనే వేసుకుంటానని ఎప్పటి నుంచో చెబుతున్నారు.తీరా.. వ్యాక్సిన్ వేసే రోజు వచ్చేసరికి మాత్రం ఆయన వేసుకోలేదు. దీనికి ఆయన తెగ ఫీల్ అయిపోతున్నారు. వ్యాక్సిన్ వేసుకుందామని అనుకున్నామని.. కానీ ప్రధానమంత్రి మాత్రం రాజకీయ నేతలు.. ప్రజాప్రతినిధులు వ్యాక్సిన్ వేయించుకోవటానికి దూరంగా ఉండాలని చెప్పటంతో తాము వేయించుకోలేదని చెబుతున్నారు.

ప్రజాప్రతినిధులకు ప్రాణమైన పొలిటికల్ మైలేజీ వచ్చేందుకు వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం ఉంది. అయితే.. మోడీ మాత్రం తొలుత వైద్యులు.. వైద్య సిబ్బంది.. ఆరోగ్య కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని చెప్పటం.. రాజకీయ నేతలు.. ప్రజాప్రతినిధులు దూరంగా ఉండాలన్నారు. అయితే.. అందరూ మోడీ చెప్పిన మాటను తూచా తప్పకుండా ఫాలో అయ్యారా? అంటే కాదనే చెప్పాలి.

యూపీలో బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ.. బెంగాల్ లో రాష్ట్ర మంత్రి నిర్మల్ మజీ.. టీఎంసీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ ఛటర్జీ.. సుభాష్ మోండల్ లు తొలిరోజున వ్యాక్సిన్ వేసేసుకున్నారు. మరి.. వీరికి ప్రధాని మోడీ మాట అక్కర్లేదా? అంటే.. వ్యాక్సిన్ వేయించుకుంటే వచ్చే దమ్ము ఇమేజ్ ముందు.. మోడీ మాటను ఎందుకు పట్టించుకుంటారు చెప్పండి. ఏమైనా.. తన ప్రకటనతో ఎంతో మంది ప్రజాప్రతినిధుల్లోని దమ్మును చూసే ఛాన్సు లేకుండా ప్రధాని చేశారని చెప్పాలి.