Begin typing your search above and press return to search.

ముంచే వరకు మొండితనం పోదా మోడీషా?

By:  Tupaki Desk   |   6 Dec 2020 11:24 AM IST
ముంచే వరకు మొండితనం పోదా మోడీషా?
X
దేశం ఇప్పటివరకు ఎన్నో ఉద్యమాలు.. నిరసనలు.. ఆందోళనల్ని చూసింది. కానీ.. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని వినూత్నమైన రైతు నిరసన దేశం మొత్తాన్ని తన వైపు చూసేలా చేస్తోంది. వాస్తవానికి ఈ రైతు ధర్నాకు మీడియాలో వస్తున్న కవరేజ్ చాలా పరిమితం. ఈ మాత్రం దానికేస్పందన ఈ రీతిలో ఉంటే.. ఇకయావత్ దేశం మొత్తం.. మీడియా దానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తే.. పరిస్థితి మరోలా ఉండేదని చెప్పాలి.

గడిచిన పది రోజులుగా వణికించే చలిని లెక్క చేయకుండా దేశ రాజధాని సరిహద్దుల్లో చేస్తున్న రైతు ఆందోళన విషయంలో మోడీ సర్కారు మొండితనంతో వ్యవహరిస్తోంది. రైతు సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నా.. వారి భేటీలు ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. శనివారం జరిగిన భేటీ సైతం విఫలమైంది. వ్యవసాయ చట్టాల్ని కొత్తగా తీసుకొచ్చిన వాటిని మోడీ సర్కారు వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుంటే.. అందుకు భిన్నంగా స్పందిస్తోంది ప్రభుత్వం.

ఆందోళన చేస్తున్న రైతులు ఎంత పట్టుదలతో ఉన్నారో.. అంతే మొండితనంతో వ్యవహరిస్తోంది మోడీ సర్కారు. ఎవరెంత చెప్పినా.. తాము చేసిన చట్టాన్ని రద్దు చేసే విషయానికి వస్తే మాత్రం ససేమిరా అని తేల్చేస్తున్నారు. ఒక మోస్తరునిరసన జరిగితే.. ఇలాంటి పట్టుదలను ప్రదర్శించొచ్చు. అందుకు భిన్నంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నా.. చట్టాన్ని మార్చే విషయానికి వస్తే మాత్రం.. నో అంటే నో అనేస్తున్నాయి. లక్షలాది మంది రైతులు ఇళ్లను వదిలేసి.. రోజుల తరబడి రోడ్ల మీద ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. తన వాదనకు కట్టబడి ఉంటానని చెప్పటం అర్థం లేనిది. ఇప్పుడున్న పరిస్థతుల్లో చేతల్లో ఎలా ఉన్నా.. మాటల్లో మాత్రం మొండితనం కనిపించకూడదన్న విషయాన్ని మోడీషాలు ఎప్పటికి గర్తిస్తారో? ఇలాంటి తప్పులే ఒక్కోసారి ముంచే వరకు వెళతాయన్నది వారెందుకు విస్మరిస్తున్నారో?