Begin typing your search above and press return to search.

బొగ్గు నిల్వలు పెంచుకోకపోతే కష్టమేనా ?

By:  Tupaki Desk   |   19 Oct 2022 5:30 AM GMT
బొగ్గు నిల్వలు పెంచుకోకపోతే కష్టమేనా ?
X
రాబోయే వేసవికాలంలో రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్య ఉండకూడదంటే ప్రభుత్వం బొగ్గు నిల్వలు పెంచుకోవాల్సిన అవసరముంది. థర్మల్ కేంద్రాల్లో నిల్వచేసుకునే బొగ్గుమీదే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఆధారపడుందని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్నీ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 6050 మెగావాట్లు. అయితే ఇపుడు ఉత్పత్తిచేస్తున్నది కేవలం 2500 మెగావాట్లు మాత్రమే. మరి సుమారు 4 వేల మెగావాట్ల విద్యుత్ ఎందుకు ఉత్పత్తి కావటంలేదు. ఎందుకంటే బొగ్గు కొరత మాత్రమే కారణం.

కొన్ని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు బాగా తగ్గిపోతున్నాయి. బొగ్గు కొరత తీవ్రంగా వేధిస్తున్న కారణంగానే విద్యుత్ ఉత్పత్తిని తగ్గించేసింది. ఉదాహరణకు వీటీపీఎస్ లో 50 వేలటన్నులు, రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 25 వేల టన్నులు మాత్రమే నిల్వలున్నాయి.

కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో లక్షటన్నుల బొగ్గు నిల్వలుమాత్రమే ఉన్నాయి. పూర్తిస్ధాయి సామర్ధ్యంతో విద్యుత్ కేంద్రాలు పనిచేస్తే ఈ నిల్వలు రెండురోజులు కూడా రావు. మరి మిగిలిన రోజులంతా ఈ కేంద్రాలు ఏమిచేయాలి ?

వచ్చే వేసవికాలంలో రోజుకు 250 మిలియన్ యూనిట్ల అవసరం ఉంటుందని ఉన్నతాధికారులు అంచనా వేశారు. ఇపుడు కొన్ని రోజులుగా రాష్ట్రంలో 180 మిలియన్ యూనిట్ల వాడకం మాత్రమే రికార్డవుతోంది. అంటే ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు చలి ఉందికాబట్టే రాత్రుళ్ళు విద్యుత్ వాడకం తగ్గింది. బొగ్గు నిల్వల పరిస్ధితి ఇలాగే ఉంటే కష్టాలు తప్పవని అందరికీ తెలిసిందే.

వేసవికాలం అంటే మరో నాలుగు నెలల తర్వాత ప్రజల అవసరాలు బాగా పెరిగిపోతాయి. అప్పటికి బొగ్గు నిల్వలను పెంచుకోకపోతే కష్టమే. మామూలుగా అయితే ప్రతి విద్యుత్ కేంద్రంలోను కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గునిల్వలుండాలి.

అంటే ప్రతి కేంద్రంలోను 15 లక్షల టన్నుల బొగ్గు నిల్వలుండాలి. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే ఇన్నేసి లక్షల టన్నుల బొగ్గు కొనటానికి ప్రభుత్వానికి వేల కోట్లరూపాయలు అవసరం. అంత డబ్బు ప్రభుత్వం దగ్గర డబ్బులేదు. మరి ఏమి చేస్తుందో చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.