Begin typing your search above and press return to search.

బీజేపీ ఎంపీ అర్వింద్ కు ఈ సారి గెలుపు క‌ష్ట‌మేనా?

By:  Tupaki Desk   |   1 Feb 2022 4:35 PM GMT
బీజేపీ ఎంపీ అర్వింద్ కు ఈ సారి  గెలుపు క‌ష్ట‌మేనా?
X
ఔను! ఇప్పుడు ఎక్కువ‌గా ఈ మాటే వినిపిస్తోంది. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ రాజ‌కీయ వార‌సుడిగా రంగంలోకి దిగిన అర్వింద్ ఆది నుంచి బీజేపీవైపు ఉన్నారు. అయితే.. ఆయ‌న వ‌చ్చీరావ‌డంతోనే ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర వేసుకున్నారు. అధికార టీఆర్ ఎస్‌పై విరుచుకుప‌డ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అని అనిపించుకున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు.. ఎక్క‌డిక‌క్క‌డ విరుచుకుప‌డుతూ.. త‌న వాగ్ధాటిన‌ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. నిజామాబాద్ నుంచి 2019 ఎన్నిక‌ల్లో సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌పై విజ‌యం సాధించిన త‌ర్వాత‌.. త‌న దూకుడును మ‌రింత పెంచారు.

నిజానికి అప్ప‌టి వ‌ర‌కు ఉన్న అర్వింద్ వేరు... గెలుపు త‌ర్వాత‌.. అర్వింద్ వేరు.. అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది. ఒక సంచ‌ల‌నం అయ్యారు. ఇక‌, మాట‌ల‌తో ఎదుటి వారిని ఆక‌ర్షించే ల‌క్ష‌ణం ఉండ‌డంతో అర్వింద్ మ‌రింత‌గా రెచ్చిపోయి.. మీడియాను సైతం ఆక‌ర్షించారు.. నాలుగు మాట‌ల్లో రెండుఫైర్ ఉండ‌డంతో ఆయ‌న మాట్లాడుతుంటే.. చానెళ్ల రేటింగులు కూడా పెరిగాయి. దీంతో త‌న‌కు తిరుగులేద‌ని.. త‌న‌ను గెలిచేవారు లేర‌ని.. ఆయ‌న అతి న‌మ్మ‌కం పెంచుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సాధారణంగా.. రాజ‌కీయాల్లో ఉన్న ఏ నాయ‌కుడికైనా... ఏవో లోపాలు ఉంటాయి..

అయితే.. అర్వింద్ విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల్లో నిజామాబాద్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన కీల‌క హామీని ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న నెర‌వేర్చ‌లేక పోయారు. అదే ప‌సుపు బోర్డు! ఇక్క‌డి రైతులు దీనికోసం ఎంత ఉద్య‌మించా రో.. ఆఖ‌రుకు మోడీపై పోటీ చేసి..ఆయ‌న‌ను ఓడించేందుకు కూడా సిద్ధ‌మ‌య్యారో.. అంద‌రికీ తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే త‌ను ఎంపీ అయితే.. తొలిప్రాధాన్యంగా ప‌సుపు బోర్డు తీసుకువ‌స్తాన‌ని అర్వింద్ చెప్పారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిని సాధించ‌లేక పోయారు. భ‌విష్య‌త్తులోనూ.. సాధించే ఛాన్స్ లేదు.

ఈ క్ర‌మంలో నిజామాబాద్ రైతులు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇదిలావుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని అర్వింద్ భావిస్తున్నారు. దీంతో ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంపై ఆయ‌న క‌న్నేసిన‌ట్టు గుస‌గుస వినిపిస్తోంది. అయితే.. అక్క‌డ అధికార పార్టీ టీఆర్ ఎస్ ఫైర్ బ్రాండ్ జీవ‌న్ రెడ్డి ఉన్నారు. ఈయ‌నకు కూడా ఇక్క‌డ ప్ర‌జ‌ల నుంచి సెగ‌లు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. అర్వింద్ పోటీ చేసినా.. గెలిచే ఛాన్స్ లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఎందుకంటే.. జీవ‌న్ రెడ్డి లోక‌ల్ నాయ‌కుడు. అర్వింద్ ఇక్క‌డ నుంచి రంగంలోకి దిగాల‌ని చూస్తే.. నాన్‌లోక‌ల్ అనే అస్త్రం జీవ‌న్ రెడ్డికి ఆయుధంగా మారి.. అర్వింద్ ఓట‌మికి బాగా ప‌నిచేస్తుంద‌ని చెబుతున్నారు. వీరిద్దరి ప‌రిస్థితి ప‌క్క‌న పెడితే.. కాంగ్రెస్ నుంచి బ‌ల‌మైన నాయ‌కుడు ఇక్క‌డ పోటీ చేస్తే.. ఫ‌లితం మొత్తం యూట‌ర్న్ తీసుకుని కాంగ్రెస్ లాభించే ఛాన్స్ ఉంటుంద‌న‌ని అంటున్నారు. ఫ‌లితంగా.. అర్వింద్ అటు నిజామాబాద్ పోగొట్టుకుని.. ఇటు ఆర్మూర్‌లో డిపాజిట్ పోగొట్టుకుని.. విల‌పించ‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.