Begin typing your search above and press return to search.

ఇలాంటి దరిద్రపు పరిస్థితిని గొప్పగా చెప్పుకోవటమా?

By:  Tupaki Desk   |   10 April 2020 9:30 AM IST
ఇలాంటి దరిద్రపు పరిస్థితిని గొప్పగా చెప్పుకోవటమా?
X
లక్ష కోట్లను ఇట్టే దాటేసే వార్షిక బడ్జెట్లను చూసి మనకంటే మొనగాళ్లు ఎవరూ లేరన్నట్లుగా చొక్కా కాలర్ ఎగరవేసే పాలకులు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది కరోనా. మన పరిస్థితి బ్రహ్మాండంగా ఉందంటూ బడాయి చెప్పటం తేలికే కానీ.. సమస్య ఏదైనా మీద పడితే ఎంతలా ఆగమాగం అవుతామో.. నెలసరి జీతాల్లోనూ కోత పడేంత అల్పమైన బతుకులన్న విషయాన్ని కరోనా మా చక్కగా చెప్పేసింది. కీలకమైన వైద్యానికి.. విద్యకు మన పాలకులు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో అర్థమయ్యేలా చేసింది.

కీలకమైన ఆరోగ్య రంగాన్ని పాలకులు ఎంతలా నిర్లక్ష్యం చేశారన్న విషయం కళ్లకు కట్టినట్లుగా అర్థం కావటమే కాదు.. ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే మనమెక్కడ ఉన్నామన్న విషయం కరోనా ఎపిసోడ్ తో అర్థమయ్యేలా చేసింది. ఇలాంటి వేళలోనూ గొప్పలు చెప్పుకోవటం తెలంగాణరాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ వారికే చెల్లుతుందని చెప్పాలి. వెయ్యి వెంటిలేటర్లకు ఆర్డర్ ఇవ్వటాన్ని గొప్పగా చెప్పుకునే ఆయన మాటల్ని చూస్తూ నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి.

ప్రాణం మీదకు వచ్చిన వేళ.. పరుగు పరుగున వెంటిలేటర్లు కొనుగోలు చేయటం కూడా ఒక గొప్పేనా? అన్నది క్వశ్చన్. అంతేకాదు.. తెలంగాణ వైద్య శాఖ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూ.70 కోట్ల సామాగ్రిని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఖర్మ కాకుంటే.. 1.30లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఒకేసారి అందునా కరోనా లాంటి అత్యవసర పరిస్థితుల్లో రూ.70కోట్లు పెట్టి వైద్య సామాగ్రి కొనటం కూడా గొప్పనేనా? అన్న భావన మంత్రి ఈటెల వారి మాటల్ని విన్నంతనే కలగటం ఖాయం.

ఇప్పుడు గొప్పలు చెప్పుకునే సమయం ఎంతమాత్రం కాదని ఆయనకు ఎప్పటికి అర్థమవుతుందో? తమ బతుకులు ఎంత అల్పమైనవన్న విషయం ప్రజలందరికి అర్థమైపోతున్న వేళ రూ.70కోట్లు పెట్టి కొనే వైద్యసామాగ్రిని గొప్పగా చెప్పుకోవటం లాంటివి పిల్ల విషయాలన్నది ఎందుకు అర్థం కావట్లేదు? సంపన్న రాష్ట్రమని డబ్బా కొట్టుకునే చోట.. ఇరవై ఒక్క రోజుల లాక్ డౌన్ కే జీతాలు కోత పెట్టుకునే సమయంలో గొప్పలు ఏమాత్రం బాగోవు ఈటెల మాష్టారు.