Begin typing your search above and press return to search.

డేంజర్ అంచుల్లోకి హైదరాబాద్ వెళ్లిపోతోందా?

By:  Tupaki Desk   |   22 Nov 2020 11:16 AM IST
డేంజర్ అంచుల్లోకి హైదరాబాద్ వెళ్లిపోతోందా?
X
అవును.. ఇది నిజం. హైదరాబాద్ మహానగరంలో నివసించే 1.30 కోట్ల మంది ఇప్పుడు అపాయం అంచున ఉన్నారు. విన్నంతనే అతిశయంగా అనిపించినప్పటికి ఇది నిజం. గడిచిన కొద్దిరోజులుగా కరోనా మహమ్మారి పడగ నీడ మహానగర ప్రజల మీద పెద్దగా లేదనే చెప్పాలి. కొద్ది నెలల క్రితం రోజుకు మూడు వేల కేసులకు పైగా నమోదయ్యే స్థాయి నుంచి ప్రస్తుతం రోజుకు 150 కంటే తక్కువ కేసులు నమోదువుతున్నాయి.

ఈ లెక్కచూస్తే కాస్తంత ఉపశమనం కలిగించేలా పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పుడు వచ్చిన చిక్కంతా హైదరాబాద్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే. కరోనా నిబంధనల్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా వ్యవహరిస్తున్న నగర ప్రజల తీరు మహమ్మారి విరుచుకుపడే అవకాశాన్ని ఇస్తోంది. దీనికి తోడు.. తాజాగా జరుగుతున్న గ్రేటర్ పోరుతో పరిస్థితులు మరింత దిగజారుతాయన్న మాట బలంగా వినిపిస్తోంది.

తెలంగాణ అధికారపక్షంతో పాటు విపక్షం పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహించటం.. శనివారం నుంచి మంత్రి కేటీఆర్ రోడ్ షోలను ఏర్పాటు చేసిన తీరు చూస్తే.. అసలు కరోనా ఉందన్న విషయాన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయినట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ అమెరికన్లు మిగిలిన విషయాల్ని పట్టించుకోకపోవటం.. కరోనా జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఇప్పుడు వారెలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో చూస్తున్నదే.

గ్రేటర్ హైదరాబాద్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ఇలాంటి అపాయమే ముంచుకొచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఎన్నికల హడావుడిలో పడిన ప్రభుత్వం.. మిగిలిన అంశాల్ని పట్టించుకోవటం లేదు. రానున్న ముప్పును పసిగట్టే వ్యవస్థను అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ కనిపించదు. ఇదంతా చూస్తే.. ఎన్నికలు పూర్తి అయ్యే నాటికి వైరస్ ట్రాన్స మిషన్ జరుగా సాగే వీలుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. హైదరాబాద్ ఇమేజ్ తో పాటు.. ప్రజలకు కలిగే కష్టం అంతా ఇంతా కాదు. పాలకుల సంగతి ఎలా ఉన్నా.. ప్రజలైతే మాత్రం ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం తేడా కొట్టినా కరోనాకు నగర ప్రజలు కకావికలం కావాల్సిందే.