Begin typing your search above and press return to search.

ఇండియాలో మోస్ట్ పవర్ ఫుల్ మ్యాన్ అతడేనా?

By:  Tupaki Desk   |   16 Aug 2019 6:22 AM GMT
ఇండియాలో మోస్ట్ పవర్ ఫుల్ మ్యాన్ అతడేనా?
X
సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో విజయాన్ని సొంతం చేసుకొని.. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ.. కీలక నిర్ణయాల్ని వరుస పెట్టి తీసుకుంటున్నారు. దశాబ్దాల తరబడి నానబెడుతూ వస్తున్న అంశాలపై ఫటా పట్.. ధనా దన్ అన్న రీతిలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున నిర్ణయాలు తీసుకుంటున్న వైనం తెలిసిందే. తాజాగా నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించిన ప్రసంగించిన ప్రధాని మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి కమిటీ చర్చల్లోనే మురగబెట్టిన ఒక కీలకాంశంపై ప్రధాని హోదాలో మోడీ నిర్ణయం తీసేసుకున్నారు. ఇప్పటివరకూ దేశ భద్రతలో కీలకమైన త్రివిధ దళాలకు వాటి అధిపతులు వేర్వేరుగా ఉండేవారు. ఆర్మీ.. ఎయిర్ ఫోర్స్.. .నేవీలకు వేర్వేరుగా అధిపతులు ఉండేవారు. ఈ విధానం చూసేందుకు బాగానే ఉన్నా.. ఆచరణలోకి వచ్చేటప్పటికి మాత్రం తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్న పరిస్థితి. కీలక సందర్భాల్లో ఏ నిర్ణయాన్ని ఎవరు తీసుకోవాలి? ఎవరి నిర్ణయాన్ని ఎవరు పాటించాలన్న విషయానికి వస్తే.. విపరీతమైన గ్యాప్ తో పాటు.. ఈగోల కారణంగా నష్టపోతున్న పరిస్థితి. ఈ విషయాలేవీ బయటకు రాకున్నా.. అంతర్ఘత సంభాషణల్లో బయటకు వస్తుంటాయి. ఇలాంటి తీరును సరి చేసేందుకు వీలుగా ప్రధాని మోడీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

త్రివిధ దళాధిపతులకు సూపర్ బాస్ ను ఒకరిని ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. ఈ వ్యక్తి.. త్రివిధ దళాల అధిపతులకు సూపర్ బాస్ గా మారటమే కాదు.. ఆయన కిందనే మిగిలిన వారు పని చేయాల్సి ఉంటుంది. దీంతో.. చాలావరకూ గ్యాప్ లు పూడ్చుకోవటమే కాదు.. విభాగాల మధ్య విబేధాలకు అవకాశం ఉండని పరిస్థితి నెలకొనటం ఖాయం. ప్రధాని మోడీ మాట ప్రకారం చూస్తే.. సైన్యం.. నౌకాదళం.. వైమానికదళాలకు కలిపి ఉమ్మడిగా రక్షణ బలగాల అధిపతిని నియమించనున్నట్లుగా చెప్పారు. పలు దేశాల్లో ఇదే విధానాన్ని అమలు చేస్తున్నా.. తాజాగా మోడీ కారణంగా ఇదే తీరును భారత్ కూడా అనుసరించనుంది.

ఈ నిర్ణయం వెనుక కారణం లేకపోలేదు. 1999లో భారత్.. పాక్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం తర్వాత.. దేశ భద్రతా వ్యవస్థలోని లోపాలపై పరిశీలనకు సుబ్రమణ్యం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకొని.. ఈ సూపర్ బాస్ పదవిని ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇదే విషయాన్ని 2001లో ఏర్పాటు చేసిన మంత్రుల బృందం కూడా సిఫార్సు చేసింది. త్రివిధ దళాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవటం.. అపోహల కారణంగా వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారన్న విషయాన్ని గుర్తించారు. త్రివిధ దళాలకు నాయకుడిగా వ్యవహరించే వీరిని ఫైవ్ స్టార్ సైనికాధికారిగా వ్యవహరిస్తారు. మరి.. ఈ సూపర్ పవర్ పోస్ట్ కు ఎంపిక అయ్యే అవకాశం ఎవరికి ఉందన్న విషయంలోకి వెళితే.. ఆ లక్కీ మ్యాన్ గా సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ ను వరించే అవకాశం ఉందని చెబుతున్నారు.