Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా బీయారెస్ లీడర్ ఆయనేనటగా...?

By:  Tupaki Desk   |   4 Oct 2022 2:30 PM GMT
ఉత్తరాంధ్రా బీయారెస్ లీడర్ ఆయనేనటగా...?
X
ఆయన చాలా పార్టీలు మారారు. ఇంకా మారాలనుకుంటున్నారు. రాజకీయంగా ఒకనాడు ఎన్నో వైభవాలు చూశారు. అధికార విలాసాలు చూసారు. దర్జాలు దర్పాలూ అన్నీ గతకాలం ముచ్చట అయిపోయిన తరువాత కూడా ఆయనలో ఆశలు ఇంకా అలాగే ఉన్నాయి. మళ్లీ చాన్స్ దొరికితే లాంగ్ జంప్ చేసైనా రాజకీయ అదృష్టం పరీక్షించుకుందామని ఆయన భావిస్తున్నారుట.

ఆయనే ప్రస్తుతం వైసీపీలో ఉన్నట్లుగా లేనట్లుగా ఉన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. ఆయన 1985లో ఫస్ట్ టైం టీడీపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత 2004 దాకా ఆయన ఓటమి ఎరగని వీరునిగా అనకాపల్లి నుంచి జెండా పాతేసి టీడీపీకి దాన్ని కంచుకోట చేశారు. ఈ మధ్యలో ఆయన ఎన్టీయార్ జమానాలో అనేక కీలకమైన శాఖలతో మంత్రి పదవులను కూడా నిర్వహించారు.

అయితే 2004లో ఓడిన ఆయన లక్ కలసి వచ్చి 2007లో ఎమ్మెల్సీ అయ్యారు. అది కాస్తా 2013లో పూర్తి కావడంతో టీడీపీ కంటిన్యూ చేయకపోవడంతో వైసీపీలోకి చేరారు. 2014లో తన కుమారుడు రత్నాకర్ కి టికెట్ ఇప్పించుకుని పోటీలో పెట్టినా ఆయన ఓడిపోయారు. దాంతో వైసీపీకి రాం రాం అనేసి టీడీపీ వైపుగా అడుగులు వేశారు. తిరిగి 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది అన్న లెక్కలతో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు

అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు కానీ కుమారుడికి కానీ టికెట్ అయితే దక్కలేదు మూడున్నరేళ్ళ వైసీపీ ఏలుబడిలో కనీసం నామినేటెడ్ పదవి కూడా ఇంటికి రాలేదు. దాంతో తీవ్రమైన అసంతృప్తితో రగులుతున్న దాడి ఏదో రోజున వైసీపీ నుంచి జంప్ చేస్తారని ఇప్పటికే ప్రచారంలో ఉన్న మాట. అయితే ఆయన జనసేనలో చేరుతారని అంతా అనుకుంటున్న వేళ లేటెస్ట్ గా కొత్త పార్టీలో ఆయన పేరు వినిపిస్తోంది.

కేసీయార్ కొత్తగా పెట్టొబోయే జాతీయ పార్టీ బీయారెస్ లోకి దాడి వీరభద్రరావు కుటుంబ సమేతంగా జంప్ చేస్తారు అని అంటున్నారు. టీడీపీలో ఉన్నపుడు కేసీయార్ దాడి మంచి మిత్రులు. దాడి కేసీయార్ సన్నిహితంగా మెలిగేవారు. ఇప్పటికీ ఆ స్నెహా బంధం అలాగే ఉంది అని అంటున్నారు. దాంతో కేసీయార్ వైపు నుంచి ఫోన్ వచ్చిందో ఏమో తెలియదు కానీ దాడి మాస్టార్ అయితే కొత్త పార్టీ వైపుగా వడివడిగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.

నేరుగా కేసీయార్ తోనే మంచి రిలేషన్స్ ఉన్నందువల్ల తన కుమారిడి రాజకీయ భవిష్యత్తు బీయారెస్ లో బాగా ఉంటుంది అని ఆయన ఆశిస్తున్నారు అని అంటున్నారు. పైగా భారత రాష్ట్ర సమితి అని పేరు ఉన్నందువల్ల జాతీయ పార్టీ కావడం వల్ల చేరి ఏపీలో రాజకీయాలు చేసినా పెద్దగా ఇబ్బందులు ఎదురుకావని అంచనా వేస్తున్నారు అని అంటున్నారు. ఇక కేసీయార్ నమ్మి ముందుకు వచ్చేవారికి ఏ సమయంలో అయినా అండగా ఉంటారు అని అంటున్నారు. చంద్రబాబు కంటే చాలా విషయాల్లో కేసీయార్ నయమని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని కూడా చెబుతున్నారుట.

మొత్తానికి అన్నీ అనుకూలిస్తే దాడి ఫ్యామిలీ చేరడం ఖాయమనే అంటున్నారు. ఫస్ట్ ఫోన్ కాల్ కూడా ఈ మాజీ మంత్రికే రావడం జరిగింది అని ప్రచారం సాగుతున్న వేళ ఉత్తరాంధ్రా నుంచి బీయారెస్ లో చేరే తొలి నేత ఆయనే అవుతారా అంటే జవాబు కోసం వేచి చూడాల్సిందే. ఆయంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఒక కీలక రాజకీ కుటుంబం కూడా బీయారెస్ కి జై కొడుతోంది అని అంటున్నారు.

ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆ రాజకీయ కుటుంబానికి సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్లనే బీయారెస్ రూట్ పడుతోందని చెబుతున్నారు. అదే విధంగా విజయన‌గరం జిల్లాలో కూడా కేసీయార్ సామాజికవర్గానికి చెందిన వారు కొత్త పార్టీ అంటున్నారు అని తెలుస్తోంది. శ్రీకాకుళంలో ఇపుడు కాకపోయినా కీలక సమయంలో ప్రముఖులే అన్నీ అంచనాలు చూసి గోడ దూకుతారు అని చెబుతున్నారు. అయితే దాడి చేరితే ఉత్తరాంధ్రా బీయారెస్ జెండాను అన్ని జిల్లాల్లో ఎగరేసే కీలక బాధ్యతలు తీసుకుంటారు అని అంటున్నారుట. మరి ఇది కేవలం గాసిప్పా లేక నిజంగా దాడి వారు దూకుతారా అంటే రాజకీయ వెండి తెర వైపు చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.