Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ ఆయనే... నో డౌట్

By:  Tupaki Desk   |   1 Oct 2022 8:05 AM GMT
కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ ఆయనే... నో డౌట్
X
కాంగ్రెస్ పార్టీ తన శతాధిక సంవత్సరాల చరిత్రలో చాలా కాలానికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇప్పటికి పాతికేళ్ల క్రితం కాంగ్రెస్ లో ఎన్నికలు జరిగాయి. అపుడు కూడా గాంధీ వంశీకులు ఎవరూ లేరు. గాంధీ ఫ్యామిలీకి సంబంధం లేని కాంగ్రెస్ నాయకుల మధ్య పోటీ జరిగితే సీతారాం కేసరి గెలిచారు.

ఇపుడు చూస్తే పోటీ ఏమీ పెద్దగా జరుగుతుంది అని ఎవరికీ అనిపించడంలేదు. కర్నాటకకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మల్లిఖార్జున్ ఖర్గే కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ అవడం ఖాయం. ఆయనతో పోటీ పడుతున్న కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి శశి ధరూర్ పెద్ద్దగా ప్రభావం చూపించే అవకాశాలు లేవు అంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో పాత విధానాలు మారాలి అంటూ ఇన్నాళ్ళూ వచ్చారు.

ఇక ఆయన జీ 23 నేతల మీద ఆశలు పెట్టుకున్నా వారు కూడా ఖర్గే అభ్యర్ధిత్వం వైపే మద్దతుగా ఉన్నారు. ఈ మేరకు ఖర్గే అభ్యర్థిత్వానికి తాము మద్దతు ఇస్తామని జి-23 నేతలు పృథ్వీరాజ్ చవాన్, మనీశ్ తివారీ, భూపిందర్ హుడా ప్రకటించడమే విశేషం. ఇక ఎవరికీ రానంతమంది మద్దతు ఖర్గే నామినేషన్ వేళ వచ్చింది. కాంగ్రెస్ లో సీనియర్ అనుకున్న వారంతా ఆయనకు మద్దతుగా నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేశారు.

గాంధీల మద్దతు ఖర్గేకు ఉందని ఇప్పటికే అందరికీ తెలుసు. మరి అది తెలిసిన తరువాత వేరే వారికి మద్దతు ఎందుకు ఇస్తారు. ఇక మల్లిఖార్జున ఖర్గే రాజకీయ జీవితం మొత్తం చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దల పట్ల గాంధీల పట్ల పూర్తి విధేయతను చూపుతూ వచ్చారు. ఆయన పదవుల కంటే కూడా గాంధీల మీద భక్తితోనే పార్టీలో ఉన్నారు.

కర్నాటక సీఎం గా ఆయనకు మూడు సార్లు అవకాశం వచ్చినట్లే వచ్చి జారిపోయింది. అయినా కూడా ఆయన బాధపడలేదు. పదవులు కంటే గాంధీల అభిమానమే ముఖ్యం అనుకున్నారు. దాని ఫలితమే 2014లో ఆయన కర్నాటక నుంచి లోక్ సభకు గెలిస్తే ఆయన్ని లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా సోనియా గాంధీ నియమించి గౌరవించింది.

ఇక 2019 నాటికి ఆయన ఓడిపోయాక రాజ్యసభ సీటు ఇచ్చి పెద్దల సభలో కాంగ్రెస్ పక్ష నేతను చేసి ఆదరించారు. ఇపుడు ఆయనకు ఏకంగా కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అప్పగిస్తున్నారు. ఆయన గెలుపు ఎంత డ్యాం ష్యూర్ అన్నది తెలుసు కాబట్టే ఒక నేతకు ఒకే పదవి అన్న సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే రాజ్యసభలో తన ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయ‌డం జరిగింది.

అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయనే అని తేలిపోతోంది కదా. ఆయన దళిత నాయకుడు. కాంగ్రెస్ పార్టీ అణగారిన వర్గాల పక్షం ఉందని చెప్పుకోవడానికే ఆయన అభ్యర్ధిత్వానికి గాంధీలు మొగ్గు చూపారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ నెల 17న ఎన్నికలు జరిగి 19న ఫలితాలు వస్తాయి కానీ అవి లాంచనం మాత్రమే అంటున్నారు. మల్లిఖార్జున ఖర్గే కొత్త కాంగ్రెస్ చీఫ్ అన్నది అందరికీ తెలిసిపోయింది.

చిత్రమేంటి అంటే అయిదు పదుల వయసులో ఉన్న రాహుల్ గాంధీ తనకొద్దీ బాధ్యతలు అంటే ఎనభయ్యేళ్ళ వయసులో ఖర్గే ఈ బాధ్యతలను మోయడానికి ముందుకు వచ్చారు. అందుకు గానూ ఆయనను మెచ్చుకోవాల్సిందే. ఇక ఖర్గే పేరుకు ప్రెసిడెంట్ గా ఉంటారా. తనదైన ముద్ర వేస్తారా అన్నది చూడాలి. దానికంటే ముందు తన సొంత రాష్ట్రం కర్నాటకలో ఈసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తెస్తారా అన్నది కూడా చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.