Begin typing your search above and press return to search.

కమ్మవారికి ఐకాన్ ఆయనేనా... ?

By:  Tupaki Desk   |   2 Dec 2021 12:30 AM GMT
కమ్మవారికి ఐకాన్ ఆయనేనా... ?
X
కమ్మ సామాజికవర్గం. చాలా గొప్పది. చరిత్రలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే రాజ్యాలు ఏలారు. సార్వభౌములుగా చలామణీ అయ్యారు. తమ మాటే శాసనంగా చేసుకుని శతాబ్దాల పాటు పాలించారు. ఇక ఆధునిక యుగాలలో వారి పాత్ర ఎన్న తగినదే. స్వాతంత్ర ఉద్యమ కాలలోనూ వారు దేశం కోసం విశేష సేవ చేశారు. ఇక స్వాతంత్రానంతరం పాలనలో భాగస్వాములు అయ్యారు. అయితే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి మాత్రం దశాబ్దాల కాలం పట్టింది. తెలుగుదేశం ద్వారానే ముగ్గురు కమ్మలకు ఆ అవకాశం లభించింది. ఎన్టీయార్, నాదెండ్ల భాస్కరరావు, చంద్రబాబు అలా ఉమ్మడి ఏపీని ఏలారు.

ఇదిలా ఉంటే గతంలోనూ టీడీపీ ఎన్నో సార్లు ఓడింది, కానీ ఎపుడూ లేని దారుణమైన పరిస్థితులను ఇపుడు ఎదుర్కొంటోంది. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావంతో అక్కడ టీడీపీ ఉనికి కోల్పోయింది. ఏపీలో చూసుకుంటే 2019 ఎన్నికల్లో చాలా ఘోరమైన ఫలితాలు వచ్చాయి. ఇప్పటికి సగం కాలం పూర్తి అయినా టీడీపీ పుంజుకుందా అంటే గట్టిగా జవాబు చెప్పలేని పరిస్థితి ఉంది. దాంతో ఆ సామాజికవర్గంలో ఆవేదన కలుగుతోంది. ఒకనాడు ఉమ్మడిగా ఏపీని పాలించి రాజకీయంగా శాసించిన తమ సామాజిక వర్గం ఇపుడు ఇలా ఎక్కడా ఉనికి లేకుండా పోవడమేంటి అన్న బాధ వారిలో కలుగుతోంది.

తాజాగా ఖమ్మంలో జరిగిన కమ్మవారి కార్తీయ సమారాధనలో పలువురు ఇదే రకమైన భావనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా మధిర మునిసిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు కమ్మ వారి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కమ్మ వారు రెండు రాష్ట్రాల్లో ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు, వారికి ఈ దుస్థితి కలగడానికి సరైన దిశానిర్దేశం లేకపోవడమే అని కూడా పేర్కొన్నారుట.

గతంలో అనంతపురానికి చెందిన పరిటాల రవి బతికి ఉన్నపుడు కమ్మ వారికి ఎంతో విలువ గౌరవం ఉండేవని ఆయన అన్న మాటలు హైలెట్ అవుతున్నాయి. రవి కమ్మ సామాజిక వర్గాన్ని ఎంతగానో ఆదుకున్నారని కూడా వాసు చెప్పడం జరిగింది. ఆయన హత్య తరువాత కమ్మ వారి పరపతి తగ్గిందని ఆయన అంటున్నారు. అంటే కాపులకు ఒక వంగవీటి రంగా మాదిరిగా కమ్మలకు ఐకాన్ గా పరిటాల రవి ఉన్నారన్న భావనతోనే వాసు ఈ కామెంట్స్ చేశారు అంటున్నారు. కమ్మ వారికి ఆరాధ్య దైవంగా ఎన్టీయార్ ని చెప్పుకుంటారు. అయితే ఆయన్ని సొంత కుటుంబ సభ్యులే వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నారు. ఇక పాతికేళ్ళుగా టీడీపీని చంద్రబాబు తన భుజాల మీద మోస్తున్నా ఆయన పొలిటికల్ గ్లామర్ కంటే ఎత్తులను వ్యూహాలను నమ్ముకునే కధ నడిపించారు.

ఇపుడు మారిన కాల మాన పరిస్థితులలో ఎత్తులు పారకపోవడంతో టీడీపీ చిత్తు అవుతోంది. అదే టైమ్ లో కమ్మ వారికి ఆశాకిరణంగా ఎవరూ వర్తమాన రాజకీయాల్లో లేరన్న మాట కూడా మల్లాది వాసు కామెంట్స్ ద్వారా అర్ధమవుతోంది అంటున్నారు. ఆవేశం, దూకుడు కలిగిన నేతలు, దేనికైనా రెడీ అన్న వారూ కమ్మలలో లేకపోవడం వల్లనే రాజకీయంగా ఎదురు దెబ్బలు అని కూడా ఆ వర్గంలో వినిపిస్తున్న మరో మాట. మరి కమ్మలు టీడీపీని తమ సొంత పార్టీగా భావిస్తారు. ఆ లెక్కన చూస్తే చంద్రబాబు కానీ లోకేష్ కానీ వారికి ఐకాన్స్ గా కనిపించడం లేదా అన్న ప్రశ్న కూడా వస్తోంది. అదే టైమ్ లో టీడీపీకి భావి వారసుడిగా జూనియర్ ఎన్టీయార్ ని చెబుతారు. మరి ఆయన మీద ఏ మాత్రమైనా ఆశలు లేవా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి తాము అన్ని రకాలుగా తగ్గి ఇబ్బందుల్లో ఉన్నామన్న ఆవేదన మాత్రం బలమైన కమ్మ సామాజికవర్గలో ఉందిపుడు. మరి వారి శక్తిని మొత్తం ఒక చోట చేర్చి నడిపించి నాయకుడు అయ్యే వారు ఆ సామాజిక వర్గంలో ఉన్నారా. లేక కొత్తగా ఎవరైనా పుట్టుకు వస్తారా అన్నది చూడాల్సిందే