Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ బీజేపీలోకి..?

By:  Tupaki Desk   |   4 Nov 2019 4:39 AM GMT
ఫైర్ బ్రాండ్ బీజేపీలోకి..?
X
టీడీపీలో ఆయనో ఫైర్ బ్రాండ్ నేత. పైగా దళిత దిగ్గజం. ఆయన నోరు తెరిచి విమర్శలు చేస్తే పగోడు కూడా పక్కా తడపాల్సిందేనంటారు.. అంతలా రెచ్చిపోయి విమర్శలు చేసే మోత్కుపల్లి టీడీపీలో కొన్నేళ్లు సీనియర్ నేతగా కీలకంగా ఉన్నారు. ఆ సమయంలో చంద్రబాబు ఈయనను తెగవాడేసి తన పగోడు అయిన కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడేలా చేసేవాడు. టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడనే పేరుంది. మోత్కుపల్లి విమర్శలకు కేసీఆర్, టీఆర్ఎస్ బెంబేలెత్తిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

అయితే ఉమ్మడి ఏపీ విడిపోయాక మోత్కుపల్లిని కూరలో కరివేపాకులా తీసిపారేశారు చంద్రబాబు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక గవర్నర్ లేదా రాజ్యసభ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని స్వయంగా మోత్కుపల్లినే ఆరోపించారు. బాబు ఎన్నికల్లో గెలవవద్దని తిరుమలకు పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు. వెన్నుపోటు దారు, ఎన్టీఆర్ ను మోసం చేశాడంటూ చంద్రబాబును చెడుగుడు ఆడేశారు. ఇప్పుడు టీడీపీకి గుడ్ బై ఏ పార్టీలో చేరకుండా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత తిట్టడం మానేశాడు. కేసీఆర్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపినా నాటి తిట్లను మదిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ద్వారాలను కేసీఆర్ మూసేశారన్న టాక్ ఉంది.

తాజాగా మోత్కుపల్లి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. సోమవారం మోత్కుపల్లి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ లు బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. మోత్కుపల్లితో రెండు గంటల పాటు చర్చలు కూడా జరిపినట్లు తెలిసింది. దీనికి మోత్కుపల్లి కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. మోత్కుపల్లి ప్రస్తుతం ఏ పార్టీలో చేరకుండా రాజకీయ భవిష్యత్తు లేకుండా మౌనంగా ఉండిపోవడం చూసి బీజేపీ స్కెచ్ గీసింది. మోత్కుపల్లి కూడా సానుకూలంగా స్పందించడంతో ఈ ఫైర్ బ్రాండ్ నేత మళ్లీ తెలంగాణ పాలిటిక్స్ లో యాక్టివ్ కానున్నారు.తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయం దిశగా అడుగులు వేస్తున్న బీజేపీకి మోత్కుపల్లి ఎలాంటి ఆయుధం అవుతాడనేది వేచిచూడాలి.