Begin typing your search above and press return to search.

ద్రౌపది గెలుపు లాంఛనమేనా?

By:  Tupaki Desk   |   22 Jun 2022 5:59 AM GMT
ద్రౌపది గెలుపు లాంఛనమేనా?
X
రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్డీయే తరఫున గిరిజన నేత ద్రౌపది ముర్మును ఎంపిక చేశారు. ఒకపుడు టీచర్ గా పనిచేసిన ద్రౌపది ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తున్నారు. చట్టసభ సభ్యురాలిగా ద్రౌపదికి చాలా అనుభవమే ఉన్నది. ఎక్కడా ఎలాంటి ఆరోపణలు కూడా ఈమె మీదలేవని సమాచారం. ఇక్కడ నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా ద్రౌపది పేరును తెరపైకి తెచ్చారు. మొదటిదేమో మహిళా అభ్యర్థిని ఎంపికచేయటం, రెండో కారణం ఏమిటంటే గిరిజన నేత కావటం.

ద్రౌపదికి ఎంఎల్ఏగా, మంత్రిగా ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఆదివాసి హక్కుల కోసం చాలాకాలం కృషిచేశారనే పేరుంది. కాబట్టి ద్రౌపది ఎంపిక పై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సిన పనిలేదు.

అనుకున్నట్లుగానే మోడి ప్రతిపాదనపై భాగస్వామ్య పక్షాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ రామ్ నాథ్ కోవింద్ కు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో నాన్ ఎన్డీయే పార్టీల తరపున కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. యశ్వత్ కూడా చట్టసభల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తనే చెప్పాలి. రాజకీయాల్లోకి రాకముందు యశ్వత్ ఐఏఎస్ అధికారిగా అనేక స్థాయిలలో పనిచేశారు. కాబట్టి ఇటు రాజకీయ నేతగా అటు ఉన్నతాధికారిగా రెండు రకాలుగానూ అనుభవం ఉన్న వ్యక్తి. అయితే యశ్వంత్ గెలుపు అనుమానమనే చెప్పాలి.

నాన్ ఎన్డీయే పార్టీలు కూడా యశ్వంత్ గెలుపు ఖాయమని పోటీ చేయించటం లేదు. నరేంద్ర మోడీకి బలమైన ప్రతిపక్షముందని, అవసరమైతే మోడికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయనే సిగ్నల్ పంపటమే ప్రధాన ఉద్దేశ్యం.

ఏదేమైనా గిరిజన నేత ద్రౌపది రాష్ట్రపతి అభ్యర్ధి కావటంతో వివిధ పార్టీల్లోని గిరిజన ఎంపీలందరు ఈమెకు ఓట్లేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాగూ రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీచేసే అవకాశం కూడా లేదు. కాబట్టి యధేచ్చగా ఎవరు ఎవరికైనా ఓట్లేసుకోవచ్చు. ఇదే సమయంలో ఎన్డీయే పార్టీల నుంచి యశ్వంత్ కు ఓట్లు పడతాయని ఆశిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.