Begin typing your search above and press return to search.

అదానీ విజయ రహస్యం అప్పులేనా? సంచలనంగా తాజా నివేదిక

By:  Tupaki Desk   |   24 Aug 2022 5:05 AM GMT
అదానీ విజయ రహస్యం అప్పులేనా? సంచలనంగా తాజా నివేదిక
X
స్టాక్ మార్కెట్ తో పరిచయం ఉన్నా లేకున్నా.. అదానీ గ్రూప్ గురించి.. దాని యజమాని గౌతమ్ అదానీ గురించి వినని భారతీయుడే ఉండదు. స్వల్ప కాలంలో దూసుకెళ్లిపోతూ.. కార్పొరేట్ ప్రపంచంలో కాకలు తీరిన వారిని సైతం సర్ ప్రైజ్ చేసే వ్యాపార వ్యూహం అదానీ గ్రూప్ సొంతంగా చెబుతారు. ఇంత దూకుడుగా అదానీ గ్రూప్ ఎలా దూసుకెళుతోంది? దాని బలం ఏమిటి? ఎడాపెడా కొత్త కంపెనీల్ని కొనుగోలు చేస్తున్న ఈ కంపెనీ విస్తరిస్తున్న వైనం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలాంటివేళ.. అదానీ విజయ రహస్యం మరేమిటో కాదు.. అప్పులే అన్న కొత్త మాట షాకింగ్ గా మారింది.

అదానీ మీద నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే పప్పులు ఉడకవు. సరైన ఆధారాలు అవసరం. తాజాగా అదానీ మీద అప్పుల ముద్ర వేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ముద్ర వేసిన నివేదిక అల్లాటప్పా కాదంటున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఎన్ డీటీవీ గ్రూపులో మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైన వేళ.. ఫిచ్ గ్రూప్ నకు చెందిన క్రెడిట్ సైట్స్ నివేదిక ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

'అదానీ గ్రూప్: డీప్లీ ఓవర్ లివరేజ్డ్' పేరుతో రూపొందించిన నివేదికలో పలు అంశాల్ని పేర్కొన్నారు. 'అత్యంత ఆశావాహ దృక్పథంతో.. రుణాలతో అదానీ గ్రూప్ డెవలప్ మెంట్ ప్రణాళికల్ని రూపొందించుకుంటుంది. అధ్వాన పరిస్థితులు ఎదురైతే.. ఈ గ్రూప్ తీవ్ర రుణాల్లో కూరుకుపోవచ్చు' అంటూ అసలు విషయాన్ని వెల్లడించటమే కాదు.. మరో తీవ్రమైన హెచ్చరికను సదరు నివేదికలో పేర్కొన్నారు. అదేమంటే.. "అధ్వాన పరిస్థితులు ఏర్పడితే గ్రూప్ కు చెందిన ఒకటి లేదంటే అంతకంటే ఎక్కువ గ్రూప్ కంపెనీలు ఎగవేతకు పాల్పడే అవకాశం ఉంది" అంటూ సంచలన అంశాల్ని పేర్కొంది.

అదానీ గ్రూప్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సదరు కంపెనీ బోలెడన్ని వ్యాపారాల్ని చేస్తోంది. అందులో.. గనులు.. పోర్టులు.. విద్యుత్ ప్లాట్లు.. విమానాశ్రయాలు.. డేటా సెంటర్లు.. రక్షణ రంగం లాంటివెన్నో ఉన్నాయి. తాజాగా ఎన్ డీ టీవీ మీడియా గ్రూప్ లో వాటా కొనుగోలుకు సిద్ధం కావటంతో మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు అయ్యింది. ఇటీవల కాలంలో 10.5 బిలియన్ డాలర్లతో హోల్సిమ్ కు చెందిన భారత యూనిట్లను కొనుగోలు చేసి సిమెంట్ తయారీ రంగంలోకి ఒక్కసారిగా రెండో స్థానానికి చేరాలనుకోవటం తెలిసిందే.

గడిచిన కొన్నేళ్లుగా అదానీ గ్రూప్ తీసుకుంటున్న నిర్ణయాల్ని చూస్తే.. విస్తరణ ప్రణాళికల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. దీంతో.. కంపెనీ రుణ పరిమితులు.. క్యాష్ ఫ్లో మీద ఒత్తిడి ఎక్కువ అవుతోందన్న మాట వినిపిస్తోంది. తన గ్రూప్ నకు ఏ మాత్రం సంబంధం లేని వ్యాపారాల్లోకి విస్తరించటంతో భారీ మూలధనం అవసరమవుతోందని.. ఇది ఆందోళన కలిగించే అంశంగా నివేదిక పేర్కొంది. ఇక.. గ్రూప్ అప్పుల లెక్కను నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం 2021-22 చివరకు అదానీ గ్రూప్ కు చెందిన ఆరు నమోదిత కంపెనీల స్థూల రుణాలు రూ.2.30లక్షల కోట్లు కాగా..

నగదు నిల్వలల లెక్కలు వేశాక నికర రుణాలు రూ.1.72లక్షల కోట్లు ఉన్నట్లుగా తేలాయి. కొత్త వ్యాపారాలపై దూకుడుగా పెట్టుబడులు పెట్టే కొద్దీ.. లివరేజీ.. సాల్వెన్సీ నిష్పత్తులు పెరుగుతాయని.. ఇది గ్రూప్ మొత్తం మీదా ఆందోళన కలిగించే పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కంపెనీ అయినా రుణ ఒత్తిడిలో పడే ఛాన్సులు ఉన్నాయని చెబుతున్నారు. తాజా నివేదిక పుణ్యమా అని అదానీ గ్రూప్ షేర్లు డీలా పడ్డాయి. కనిష్ఠంగా 0,5 శాతం నుంచి 5 శాతం లోపు వరకు షేర్లు డీలా పడటం గమనార్హం.