Begin typing your search above and press return to search.

ఈవాళ కొవిషీల్డ్ టైం అస్సలు బాగోలేదుగా?

By:  Tupaki Desk   |   1 March 2021 6:00 PM IST
ఈవాళ కొవిషీల్డ్ టైం అస్సలు బాగోలేదుగా?
X
నిజమే.. ఈరోజు కొవిషీల్డ్ కు ఏ మాత్రం బాగోలేదని చెప్పాలి. తన తప్పేం లేకున్నా.. ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయని చెప్పాలి. కరోనాకు చెక్ పెట్టేందుకు దేశంలో రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వగా.. అందులో మొదటిది కొవిషీల్డ్ అయితే.. రెండోది కోవాగ్జిన్. కొవిషీల్డ్ కు క్లినికల్ ట్రయల్స్ పూర్తిగా అయిపోగా.. భారత్ బయోటెక్ వారు రూపొందించిన కొవాగ్జిన్ మూడోదశ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదని చెబుతారు. ధీనిపై ఇప్పటికే బోలెడన్ని విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే.. కొవిషీల్డ్ కు ఏమాత్రం తమ వ్యాక్సిన్ తీసిపోదని.. మరింత మెరుగ్గా పని చేస్తుందని భారత బయోటెక్ గతంలో వ్యాఖ్యానించింది. దేశంలో మొదలుపెట్టిన వ్యాక్సినేషన్ లో అత్యధికులకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ రోజునుంచి దేశ వ్యాప్తంగా పెద్ద వయస్కులకు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా ఇచ్చేందుకు వీలుగా అనుమతులు ఇవ్వటం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామునే ప్రధాని మోడీ ఢిల్లీ ఎయిమ్స్ కు వెళ్లి మరీ వ్యాక్సిన్ వేయించుకున్నారు.

దేశ ప్రధాని ఏ వ్యాక్సిన్ వేసుకున్నారన్నది చూసినప్పుడు..ఆయన కొవాగ్జిన్ వేసుకోవటంతో ఒక్కసారిగా దాని మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉంటే.. అనూహ్యంగా ఇవాళ ఒక టీవీ చానల్ తో మాట్లాడిన మజ్లిస్అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. కొవిషీల్డ్ మీద సంచలన విమర్శలు చేశారు. కొవిషీల్డ్ 18 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య వయస్కుల వారికి మాత్రమే సమర్థంగా పని చేస్తుందని జర్మనీ ప్రభుత్వం చెప్పినట్లుగా గుర్తు చేశారు.

ఈ వ్యాక్సిన్ 64 ఏళ్ల వయస్కులకు అంత సమర్థవంతంగా పని చేయదని చెప్పిన ఓవైసీ మాటలు ఒకవైపు.. మరోవైపు అనుకోని రీతిలో ప్రధాని మోడీ కొవాగ్జిన్ టీకాను వేయించుకోవటంతో ఈ అంశంపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొవిషీల్డ్ మీద ఉన్న అనుమానాల్ని తమకు తీర్చాల్సిందిగా ఓవైసీ డిమాండ్ చేస్తున్నారు. ఇలా రాజకీయ ప్రముఖులు తమ టీకా గురించి మాట్లాడుకోవటం చూసినప్పడు కొవిడ్ షీల్డ్ కు ఈ రోజు అంత బాగా కలిసి రాలేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.