Begin typing your search above and press return to search.

ఆ వివాదాస్ప‌ద న‌టుడు జ‌న‌సేన‌లో చేరుతున్నారా?

By:  Tupaki Desk   |   6 Aug 2022 8:00 AM GMT
ఆ వివాదాస్ప‌ద న‌టుడు జ‌న‌సేన‌లో చేరుతున్నారా?
X
30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటూ ఒకే ఒక డైలాగుతో సినిమాల్లో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.. సినీ న‌టుడు పృథ్వీరాజ్. ముఖ్యంగా బ్ర‌హ్మ‌నందం సినిమాల‌కు విరామం ప్ర‌కటించాక పృథ్వీకి క‌మెడియ‌న్ గా మంచి అవ‌కాశాలు వ‌చ్చాయి. వాటిని అందిపుచ్చుకుని పృథ్వీ కూడా మంచి న‌టుడిగా ఎదిగాడు.

2019 ఎన్నిక‌ల ముందు వైఎస్సార్సీపీలో చేరిన పృథ్వీరాజ్ ఆ పార్టీ రాష్ట్ర ప్ర‌చార కార్య‌ద‌ర్శిగానూ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ప‌లు చోట్ల ప్ర‌చారం కూడా నిర్వ‌హించారు. ఇందుకు ప్ర‌తిఫ‌లంగా వైఎస్సార్సీపీ గెల‌వ‌గానే శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చానెల్ చైర్మ‌న్ గా బాధ్య‌త‌లు కూడా చేప‌ట్టారు. అయితే ఉద్యోగాలిప్పిస్తానంటూ ఒక మ‌హిళ‌తో ఆడియో కాల్ మాట్లాడి అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఆయ‌న‌పై వేటు ప‌డింది. దీంతో వైఎస్సార్సీపీలో ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

కాగా ఈ వ్య‌వ‌హారంలో త‌న త‌ప్పేమీ లేద‌న్నారు.. పృథ్వీ. త‌న త‌ప్పు ఉంటే ఆ వేంక‌టేశ్వ‌ర‌స్వామే త‌న‌ను శిక్షిస్తాడ‌న్నారు. వైఎస్సార్సీపీలోనే కొంత‌మంది త‌న వెనుక గోతులు తీసి త‌న‌ను బ‌లి చేశార‌ని పృథ్వీ చెప్పుకున్నారు. వైఎస్సార్సీపీలో ఉన్న‌ప్పుడు ఒక ఉగ్ర‌వాదిలా ప్ర‌వ‌ర్తించాన‌ని, క‌న్నుమిన్ను కాన‌క అంద‌రిని తూల‌నాడాన‌ని వాపోయారు.

కాగా వైఎస్సార్సీపీలో ఉన్న‌ప్పుడు మెగా ఫ్యామిలీపై, అమరావ‌తి రైతుల ఉద్య‌మంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.. పృథ్వీ. ఆ త‌ర్వాత వైఎస్సార్సీపీ నుంచి బ‌య‌ట‌కొచ్చాక మెగా కుటుంబానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. చిరంజీవిని ఆద‌ర్శంగా తీసుకునే తాను సినిమాల్లోకి వ‌చ్చాన‌న్నారు. అలాగే అమ‌రావ‌తి రైతుల‌కు కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

అప్ప‌టి నుంచి వివిధ టీవీ చానెళ్ల‌కు, యూట్యూబ్ చానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్న పృథ్వీరాజ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కింగ్ మేక‌ర్ అని.. ఆయ‌నే ముఖ్య‌మంత్రి అవుతార‌ని చెబుతూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా మెగా బ్ర‌ద‌ర్, జ‌న‌సేన ముఖ్య నేత నాగ బాబుతో పృథ్వీ భేటీ అయ్యారు.

తాను జ‌న‌సేన పార్టీలో చేర‌తాన‌ని ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో జ‌న‌సేన పార్టీలో చేర‌తాన‌న్నారు. కాగా పృథ్వీది ప‌శ్చిమ గోదావరి జిల్లా తాడేప‌ల్లిగూడెం. కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు. కాగా వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి ఎన్నికల బరిలో పృథ్వీరాజ్ దిగుతార‌ని అంటున్నారు.

కాగా వైఎస్సార్సీపీలో చేరాక పృథ్వీకి సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నారు. ఇప్పుడు జ‌న‌సేన పార్టీలో చేరుతుండ‌టంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాదిరిగానే అటు సినిమాలు, ఇటు రాజ‌కీయాల్లో పృథ్వీ కొన‌సాగుతారేమో చూడాలి.