Begin typing your search above and press return to search.

చంద్రబాబుకి ఆ హోదా ఇక కష్టమేనా ..ఏ హోదా అంటే ?

By:  Tupaki Desk   |   23 Nov 2019 11:13 AM GMT
చంద్రబాబుకి ఆ హోదా ఇక కష్టమేనా ..ఏ హోదా అంటే ?
X
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత కొన్ని రోజులుగా హాట్ హాట్ గా సాగుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసినప్పటినుండి టీడీపీ , వైసీపీ మధ్య విమర్శల పర్వం పీక్ స్టేజ్ కి చేరింది. ఒకవైపు వంశీ , మరోవైపు మంత్రి కోడలి నాని టీడీపీ పై , అధినేత చంద్రబాబు పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అలాగే వీరిద్దరూ లోకేష్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారాయి. ఇదే సమయంలో మరోసారి ప్రధాన ప్రతిపక్ష అంశం తెరపైకి వచ్చింది.

మొన్నటి ఎన్నికల లో టీడీపీ 23 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచింది. అందులో ఒకరు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి ..వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం టీడీపీలో ఉండే ఎమ్మెల్యేల సంఖ్య 22 . ఈ తరుణంలో మరో నలుగురు ఎమ్మెల్యే లని టీడీపీ నుండి లాగేస్తే టీడీపీ కి ప్రధాన ప్రతిపక్షం అన్న హోదా కూడా లేకుండా పోతుంది అని కొందరు చర్చించుకుంటున్నారు. దీనితో మరోసారి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాపై చ‌ర్చ సాగుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడుతూ ఈ విషయం పై స్పదించారు... మావాళ్లు చెపుతా ఉన్నారు. టీడీపీ నుంచి న‌లుగురునో.. ఐదుగురునో.. మ‌న‌లోకి లాగేసుకుంటే.. ఆ పార్టీ కి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఉండ‌ద‌ని..అంటున్నారు అని జ‌గ‌న్ స‌భ‌లోనే చెప్పుకొచ్చారు. అయితే, తాను అందుకు సిద్ధం గా లేన‌ని, ఫిరాయింపుల‌ను తాను ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్రోత్స‌హించేది లేద‌ని, ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రిజైన్ చేయ‌కుండా పార్టీలు మారే వారిపై వేటు వేయాల‌ని, ఈ మేర‌కు పూర్తి స్వేచ్ఛ‌ను అసెంబ్లీ స్పీక‌ర్‌కు ఇస్తున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

దీంతో అప్ప‌ట్లో ఈ చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్ట‌యింది. అయితే, ఇప్పుడు తాజాగా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ టీడీపీ కి రాజీనామా చేయ‌డం, వైసీపీకి మ‌ద్ద‌తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం, మ‌రో న‌లుగురు నుంచి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ప‌క్క‌ చూపులు చూస్తున్నార‌నే వార్త‌లు రావడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. తాజాగా దీనిపై స్పందించిన చంద్ర‌బాబు.. నా ప్రతిపక్ష హోదాకు ఏ ఢోకా లేదు.. ఆ హోదాను కాపాడుకోవడం నాకు తెలీదా?, ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనుకోవడం వారి భ్రమ.. ఇల్లు అలకగానే పండగకాదు.. వీరు హోదా ఇస్తేనే వచ్చిందా? ప్రజలు ఇస్తేనే వచ్చింది అని చెప్పారు. వాస్తవానికి ఇది నిజం అయినప్పటికీ .. అసెంబ్లీలో ఏ పార్టీకైనా ప్ర‌తిప‌క్ష హోదా రావాలంటే.. రాష్ట్ర అసెంబ్లీ సీట్లలో 10% సీట్ల‌ను ఆ పార్టీ కైవ‌సం చేసుకుని ఉండాల‌ని రాజ్యాంగం చెబుతోంది. ఈ లెక్కన ఏపీలో ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు దక్కాలి అంటే ..కనీసం 18 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. ఆలా ప్రతిపక్ష హోదా ఉంటేనే ఆ పార్టీ ఇచ్చే వాయిదా తీర్మానాల‌ కు వాల్యూ ఉంటుంది. అదేవిధంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం గా ఉన్న పార్టీ అధినేత‌కు లేదా ఫ్లోర్ లీడ‌ర్‌ కు కేబినెట్ హోదా ఉంటుంది. భారీ భ‌ద్ర‌త‌, సౌక‌ర్యాలు, మంత్రితో స‌మానంగా అల‌వెన్సులు ల‌భిస్తాయి. అలా కాక‌పోతే.. సాధార‌ణ ఎమ్మెల్యే కు ఉండే గౌర‌వ‌మే ల‌భిస్తుంది. చూడాలి మరి ఏమౌతుందో ..