Begin typing your search above and press return to search.

కేంద్ర ప్ర‌భుత్వం అన్ని బ్యాంకుల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేస్తోందా?!

By:  Tupaki Desk   |   16 July 2022 10:02 AM GMT
కేంద్ర ప్ర‌భుత్వం అన్ని బ్యాంకుల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేస్తోందా?!
X
దేశంలో ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మిన‌హా అన్ని బ్యాంకుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేటీక‌ర‌ణ చేస్తోందా అంటే అవున‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం వివిధ ప్ర‌భుత్వం రంగ బ్యాంకుల‌ను ఇత‌ర బ్యాంకుల్లో విలీనం చేసిన సంగ‌తి తెలిసిందే. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను క‌లిపేసింది. అలాగే కెన‌రా బ్యాంకులో సిండికేట్ బ్యాంకును విలీనం చేసింది. అదేవిధంగా యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంకును, కార్పొరేషన్ బ్యాంకును క‌లిపింది. ఇండియ‌న్ బ్యాంకులో అల‌హాబాద్ బ్యాంకును క‌లిపింది. ఈ ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల విలీనం అప్పుడే దేశంలో ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, విప‌క్షాలు, ఆర్థిక నిపుణులు పెద్ద ఎత్తున ఆందోళ‌నలు వ్య‌క్తం చేశారు.

ఇప్పుడు ఈ ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను మోడీ ప్ర‌భుత్వం ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నుంద‌నే వార్త‌లు బ్యాంకుల ఉద్యోగుల్లో ఆందోళ‌న పెంచుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వివిధ రంగాల్లో ప్రైవేటీకరణ శరవేగంగా పెరిగిపోతోంద‌ని నిపుణులు అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే యోచనలో ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 2022 సెప్టెంబర్ నాటికి ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభం కావచ్చ‌ని చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వార్తల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగుతార‌ని అంటున్నారు. ఇక రానున్న రోజుల్లో ప్ర‌భుత్వ రంగ‌మంటూ ఏదీ ఉండ‌ద‌ని.. అన్నింటినీ మోడీ ప్ర‌భుత్వం ప్రైవేటీక‌రిస్తుంద‌ని విప‌క్షాలు ఎప్ప‌టి నుంచో ఆరోపిస్తూ వ‌స్తున్నాయి.

దేశంలో అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐని మిన‌హాయించి మిగిలిన అన్ని ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రించాల‌ని నీతి ఆయోగ్‌ మాజీ డిప్యూటీ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా, ప్రధానమంత్రి ఆర్థిక సలహా బృందం సభ్యురాలు పూనమ్‌ గుప్తా ప్రభుత్వానికి ఈ మేరకు ఇప్పటికే సలహా ఇచ్చార‌ని అంటున్నారు. దేశ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ప్రైవేటీక‌ర‌ణ త‌ప్ప‌ద‌ని వారంటున్నార‌ని స‌మాచారం. అన్ని బ్యాంకులను ప్రైవేటీక‌రించాక ఆశించిన‌ ఫలితం కనిపిస్తే.. ప్రభుత్వం ఎస్బీఐని కూడా ప్రైవేటీకరించాలని వారు సూచించిన‌ట్టు చెబుతున్నారు.

ప్రైవేటీకరణ కోసం నీతి ఆయోగ్ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను షార్ట్‌లిస్ట్ చేసిందని స‌మాచారం. వార్తా క‌థ‌నాల సారాంశం మేర‌కు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ బ్యాంక్ ప్రైవేటీకరణ ఉండవచ్చని తెలుస్తోంది.

పార్ల‌మెంటులో ఈ ఏడాది బడ్జెట్‌ను స‌మ‌ర్పించిన సంద‌ర్బంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐడీబీఐ బ్యాంక్‌తో సహా దేశంలోని రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ గురించి మాట్లాడార‌ని నిపుణులు ఈ సంద‌ర్భంగా గుర్తు చేస్తున్నారు.