Begin typing your search above and press return to search.

ఇద్దరిదీ తప్పేనా ?

By:  Tupaki Desk   |   18 Sep 2021 9:30 AM GMT
ఇద్దరిదీ తప్పేనా ?
X
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని పెద్దలంటారు. తాజా ఘటనలో ఇది మరోసారి నిరూపితమైంది. కరకట్ట మీదున్న చంద్రబాబునాయుడు ఇంటిమీదకు వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. గడచిన రెండున్నరేళ్ళుగా అధికారంలో ఉన్న వైసీపీ నేతలు గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నివాసం మీదకు దాడిచేసిందిలేదు. కానీ ఇపుడు మాత్రం పెడన ఎంఎల్ఏ జోగి రమేష్ నేతృత్వంలో దాడిచేశారు. ఎందుకంటే అందుకు టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి కారణంగానే అని చెప్పాలి.

తాజాగా జరిగిన దాడికి నేపధ్యమేమిటంటే జగన్మోహన్ రెడ్డిని మాజీమంత్రి నోటికొచ్చినట్లు బూతులు తిట్టడమే. తిట్టడమే కాకుండా తన తిట్లను అయ్యన్నపాత్రుడు సమర్ధించుకున్నారు. దాంతో మండిపోయిన వైసీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ఇంటిని ముట్టడించారు. దాంతో కరకట్టపై పెద్ద గొడవ జరిగింది. రాజకీయాల్లో చాలామంది నేతలు తమ స్ధాయిమరచిపోయి, దిగజారిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. ప్రత్యర్ధులను ఎలాబడితే అలా తిట్టేస్తున్నారు.

కానీ తాజాగా సీఎంను అయ్యన్న తిట్టిన తిట్లు మాత్రం అభ్యంతరకరమే అని చెప్పాలి. పైగా తాను తిట్టిన తిట్లను చర్చిల్లో బిషప్ వాడే భాషతో పోల్చుకుని సమర్ధించుకోవటం మరింత అభ్యంతరకరమైంది. అయ్యన్న నోటిదురుసు జనాలకు కొత్తేమీకాదు. ఆడ, మగ అని చూడకుండా నోటికొచ్చిన బూతులు తిట్టేస్తుంటారు. తాను తిట్టిన తిట్లపై వైసీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తంచేసినపుడైనా అయ్యన్న ఉపసంహరించుకునుంటే బాగుండేది. కానీ అలా చేయకుండా చర్చిబిషప్ భాషతో పోల్చుకోవటమే అగ్నికి ఆజ్యం పోసిపట్లయ్యింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. సీఎంను తిట్టింది అయ్యన్న అయితే వైసీపీ వాళ్ళు చంద్రబాబు ఇంటిపై దాడిచేయటంలో అర్ధంలేదు. దాడిచేయటం కాకుండా అయ్యన్న ఇంటిముందే కూర్చుని నిరసన తెలిపుంటే బాగుండేది. తాను జగన్ను తిట్టడం వల్ల వైసీపీ నేతలు రెచ్చిపోతారని, తనింటి మీదకు కానీ లేకపోతే చంద్రబాబు ఇంటిమీద కానీ దాడి చేస్తారని అయ్యన్న ఊహించే ఉంటారు. వైసీపీ నేతలు ఆపని చేయాలనే అయ్యన్న సీఎంను నోటికొచ్చినట్లు తిట్టినట్లుంది చూస్తుంటే. జగన్ తో పాటు పోలీసులను కూడా మాజీమంత్రి బూతులు తిట్టడం చూస్తుంటే కావాలని రెచ్చగొట్టినట్లే అనుమానంగా ఉంది.

చంద్రబాబు ఇంటిమీదకు దాడి చేయటాన్ని టీడీపీ నేతలంతా వరసబెట్టి ఖండిస్తున్నారు. మరి ఇదే టీడీపీ నేతలు జగన్ ఇంటిమీదకు దాడి చేయటాన్ని ఎలా సమర్ధించుకుంటారు. కొన్ని నెలల క్రితం తాడేపల్లిలోని జగన్ క్యాంపాఫీసును వందలమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ముట్టడించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు కూడా క్యాంపాఫీసు దగ్గర పెద్ద గొడవైంది. ఇపుడు చంద్రబాబు ఇంటిమీద వైసీపీ నేతలు దాడి చేయటం తప్పయితే అప్పుడు జగన్ ఇంటిమీదకు టీడీపీ నేతలు వెళ్ళటం కూడా తప్పే. కాబట్టే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లని గుర్తుంచుకోవాలి.