Begin typing your search above and press return to search.

నోట్ దిస్ పాయింట్‌: రాజ్యాంగాన్ని గౌర‌వించ‌ర‌నే అప‌వాదు అవ‌స‌ర‌మా కేసీఆర్ స‌ర్‌!!

By:  Tupaki Desk   |   27 Dec 2022 4:31 AM GMT
నోట్ దిస్ పాయింట్‌: రాజ్యాంగాన్ని గౌర‌వించ‌ర‌నే అప‌వాదు అవ‌స‌ర‌మా కేసీఆర్ స‌ర్‌!!
X
ఔను.. జాతీయ స్థాయిలో రాణించాల‌ని.. కుదిరితే ప్ర‌ధాని పీఠం ద‌క్కించుకోవాల‌ని కూడా చూస్తున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఇప్పుడు ఈ సూచ‌నే వ‌స్తోంది. రాజ్యాంగాన్ని గౌర‌వించ‌రు! అనే మాట రేపు జాతీయ స్థాయిలో వినిపిస్తే.. అది మొత్తానికే మోసం చేస్తుందని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కు విలువ ఇవ్వ‌ని.. ముఖ్య‌మంత్రి రేపు జాతీయ రాజ‌కీయాల్లో ఏం రాణిస్తార‌నే గుస‌గుస ఇప్పటికే కొన్ని పార్టీల్లో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్‌తో మంచిగా ఉండ‌డ‌మే మంచిద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి కేసీఆర్‌కు, గవర్నర్ తమిళిసైకి కొంత కాలంగా ప‌డ‌డం లేదు. గవర్నర్‌ కోటా కింద పాడి కౌశిక్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తమిళిసై తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య వివాదం కొన‌సాగుతోంది.

వివాదాల విష‌యానికి వ‌స్తే.. ఒక‌టి కాదు రెండుకాద‌నే ధోర‌ణి కూడా కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి 26న రిప‌బ్లిక్ డే కార్యక్ర‌మాన్ని రాజ్‌భవన్ కే ప‌రిమితం చేయాల‌ని అన‌డం.. స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌కు వెళ్లిన గ‌వ‌ర్న‌ర్‌కు ప్రొటోకాల్ అమ‌లు చేయ‌క‌పోవ‌డం.. అధికారులు కూడా గ‌వ‌ర్న‌ర్‌కు స‌హ‌క‌రించ‌క‌పో వ‌డం వంటివి వివాదానికి కేంద్రంగా మారాయి.

ఇక‌, తాను జీతం కూడా తీసుకోకుండానే ప‌నిచేస్తున్నాని గ‌వ‌ర్న‌ర్ చెప్ప‌డం ద్వారా.. ఉద్దేశ పూర్వ‌కంగా ప్ర‌భుత్వం ఇబ్బంది పెడుతున్నా స‌ర్దుకుపోతున్నాన‌నే ధోర‌ణిని ఆమె ప్ర‌ద‌ర్శించిన‌ట్ట‌యింది. కేంద్రానికి ఫిర్యాదులూ వెళ్లాయి. అనేక కీల‌క బిల్లుల‌కు మోక్షం కూడా క‌ల‌గ‌లేదు. ఇలాంటి స‌మ‌యంలో కేసీఆర్ వ‌ర్సెస్ రాజ్‌భ‌వ‌న్ వేదిక‌గా విమ‌ర్శ‌లు.. వివాదాలు చోటు చేసుకున్నాయి.

అయితే.. తాజాగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము రాక‌తో.. అటు గ‌వ‌ర్న‌ర్‌, ఇటు సీఎం కేసీఆర్ ఒకే వేదిక‌ను పంచుకున్నారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య కొంత వ‌భేదాలు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌నే భావ‌న వ్య‌క్త‌మైంది. కానీ, ఇంత‌లోనే మ‌ళ్లీ కేసీఆర్‌.. గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన విందుకు డుమ్మా కొట్టారు.

మొత్తానికి ఈ ప‌రిణామాలు.. ఆయ‌న‌కు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. దేశ‌వ్యాప్తంగా రేపు బీఆర్ ఎస్ పార్టీని ప్ర‌చారంలో పెట్టే ప‌రిస్థితి వ‌స్తే.. ప్ర‌త్య‌ర్థులు ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.