Begin typing your search above and press return to search.

బీజేపీది సేమ్ సైడ్ గోలేనా ?

By:  Tupaki Desk   |   11 July 2021 5:30 AM GMT
బీజేపీది సేమ్ సైడ్ గోలేనా ?
X
ఉత్తర ప్రదేశ్ లో అధికార బీజేపీ తీసుకున్న నిర్ణయం సేమ్ సైడ్ గోల్ లాగే కనబడుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకుని ఇపుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యంగానే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను యూపీ లా కమీషన్ తెరపైకి తెచ్చింది. జనాభా నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించే ఉద్దేశ్యంతోనే లా కమీషన్ కీలకమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

లా కమీషన్ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందంటే అందుకు ప్రభుత్వం అనుమతి లేకుండా జరిగదు కదా. ఇంతకీ ప్రతిపాదనల్లో ఏముందంటే ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉంటే సంక్షేమ పథకాలు వర్తించవు. ప్రభుత్వ ఉద్యోగం కూడా రాదు. రేషన్ కార్డులో సదరు యజమానికి ఎంతమంది పిల్లలున్నా రేషన్ మాత్రం 2+2 అంటే ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరు పిల్లలకు మాత్రమే ఇస్తారు.

అలాగే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల్లో ఇప్పటికే ఇద్దరికన్నా సంతనం ఉందంటే వాళ్ళకి ప్రమోషన్లు రావు. ఇతరత్రా ప్రభుత్వ సబ్సిడీలు కూడా ఆగిపోతాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. ఇదే సందర్భంలో ఇద్దరు పిల్లలు, కుటుంబనియంత్రణను పాటించేవారు, ప్రోత్సహించే వారికి అనేక ప్రోత్సాహకాలను కమీషన్ ప్రతిపాదించింది.

క్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కుటుంబనియంత్రణ లేకపోతే ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఉపయోగం ఉండదు. అదుపులేకుండా జనాభా పెరిగిపోతుంటే ఎక్కడక్కడి పథకాలు, నిధులూ సరిపోవు. నిజానికి యూపీలోని లా కమీషన్ ప్రతిపాదనల్లో తప్పేమీలేదు. సామాజిక, ఆర్ధిక కోణంలో చూస్తే ఇద్దరు పిల్లల నినాదం చాలా మంచిదే. అలాగే రాజకీయకోణంలో చూస్తే నెగిటివ్ మార్కే పడుతుంది.

లా కమీషన్ చేసిన ప్రతిపాదనల్లో మంచి చెడులు ఎలాగున్నా వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇపుడు కీలకమైపోయింది. కమీషన్ చేసిన ప్రతిపాదనలను అన్నీ సామాజికవర్గాలు ఆమోదిస్తాయా ? అనేది సందేహమే. ఒకవేళ ఏవన్నా సామాజికవర్గాలు వ్యతిరేకిస్తే దాని ప్రభావం ఎన్నికల్లో పడక తప్పదు. అప్పుడు నష్టపోయేది బీజేపీనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.