Begin typing your search above and press return to search.

బ‌డ్జెట్ పై బీజేపీ బాధ్య‌త లేదా.. వీర్రాజు స‌ర్‌..!

By:  Tupaki Desk   |   31 Jan 2022 5:31 AM GMT
బ‌డ్జెట్ పై బీజేపీ బాధ్య‌త లేదా.. వీర్రాజు స‌ర్‌..!
X
``రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారిపోయింది. సీఎం జ‌గ‌న్ ఎడా పెడా అప్పులు చేస్తున్నారు. దీనికి అంతూ ద‌రీ లేకుండా పోయింది. ఒక‌వైపు పోల‌వ‌రం పూర్తికావ‌డం లేదు. రాజ‌ధాని నిర్మాణాలు ముందుకు సాగ‌డం లేదు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు రావ‌డం లేదు. రైల్ క‌నెక్టివిటీ కూడా లేదు. ఎక్క‌డ చూసినా.. అభివృద్ది క‌నిపించ‌డం లేదు``- ఇదీ.. త‌ర‌చుగా.. ఏపీ బీజేపీ అధ్య‌క్షులు.. సీనియ‌ర్ నాయ‌కులు.. ఆర్ ఎస్ ఎస్ వాది.. సోము వీర్రాజు చేస్తున్న కామెంట్‌. నిజ‌మే.. ఇవ‌న్నీ ఉన్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి కూడా ముందుకు సాగ‌డం లేదు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు ఇవ‌న్నీ.. ముందుకు సాగ‌డం లేదు? అనే విష‌యాల‌పై ఆయ‌న ఎప్పుడైనా దృష్టిపెట్టారా? అనేది ప్ర‌శ్న‌.

సోము వీర్రాజు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. కేంద్రం ప్ర‌వేశ పెడుతున్న బ‌డ్జెట్ ఇది రెండో సారి. 2020, మేలో ఆయ‌న రాష్ట్ర బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో 2021-22 బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు. ఇక‌, ఇప్పుడు ప్ర‌వేశ పెడుతున్న‌ది సోము హ‌యాంలో రెండోది. ఈ క్ర‌మంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్రంలో ఆయ‌న కీల‌క నేత‌. ఈ క్ర‌మంలో త‌న వంతు పాత్ర‌గా.. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను కేంద్రానికి ప్ర‌స్తావించారా? కేంద్ర బ‌డ్జెట్‌లో ఇది కావాలి.. రాష్ట్రం ఈ ఇబ్బందుల్లో ఉంది.. పోల‌వారినికి నిధులు ఇవ్వండి.. జాతీయ ప్రాజెక్టుల‌కు సొమ్ములు ఇవ్వండి అని ఆయన కోరారా? అంటే.. తొలి బ‌డ్జెట్‌ను తీసుకుంటే.. ఆయ‌న ఒక్క ప్ర‌తిపాద‌న కూడా పంప‌లేదు.

ఇక‌, ఇప్పుడు ఆయ‌న ప‌రిణితి చెందారు. అప్ప‌ట్లో అంటే.. బ‌డ్జెట్ గురించి కొత్త కాబ‌ట్టి ఆయ‌న ఏమీ ప్ర‌తిపాదించ‌లేద‌ని స‌రిపుచ్చుకోవ‌చ్చు. కానీ, ఇప్పుడు ఆయ‌న‌కు రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పైనా..కేంద్రం ఇస్తున్న నిధుల‌పైనా అవ‌గాహ‌న ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ప్ర‌వేశ పెడుతున్న బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి ఆయ‌న ఏమైనా ప్ర‌తిపాద‌న‌లు పంపారా? అంటే శూన్యం!! వాస్త‌వానికి పొరుగున ఉన్న త‌మిళ‌నాడులో బీజేపీకి ప్రాతినిధ్యం జీరో. అయిన‌ప్ప‌టికీ.. అక్క‌డ బీజేపీ నేత‌లు.. వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టేసమ‌యంలో రాష్ట్రానికి సంబంధించి అంశాల‌పై ఒక నివేదిక‌ను నెల రోజుల ముందుగానే కేంద్రానికి పంపిస్తారు.

రాష్ట్రానికి ఏం కేటాయించాలి? ఎంత నిధులు కావాలి? అనేవి ష‌యాల‌ను వారు ప్ర‌స్తావిస్తారు. వీరి నివేదిక‌కు కేంద్రం స్పందిస్తుందా? నిధుల వ‌ర్షం కురిపిస్తుందా? అనేది ప‌క్క‌న పెడితే.. ఒక ప్ర‌య‌త్నం అయితే.. చేసి,దీనిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తారు. త‌ద్వారా పార్టీ పుంజుకునేలా ప్ర‌య‌త్నాలు అయితే.. సాగుతున్నాయి. కానీ... ఏపీలో అధికారం కోరుకునే బీజేపీ నేత‌లు మాత్రం రాష్ట్ర స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేయ‌డం వ‌ర‌కే ప‌రిమితం అవుతున్నారు త‌ప్ప‌.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై కేంద్రానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ముక్క చెప్పింది లేదు. మ‌రి ఇప్పుడైనా.. స్పందిస్తారో .. లేదో చూడాలి.