Begin typing your search above and press return to search.

బీజేపీ పోటీ సమావేశాలు నిర్వహిస్తోందా ?

By:  Tupaki Desk   |   5 May 2022 4:53 AM GMT
బీజేపీ పోటీ సమావేశాలు నిర్వహిస్తోందా ?
X
బీజేపీ సంస్థాగత కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆపార్టీ అగ్రనేతలు డిసైడ్ చేశారు. ఈనెల 20,21 తేదీల్లో నిర్వహించాలని అనుకున్న సమావేశాలను కూడా రాజస్థాన్ లోని జైపూర్ లోనే నిర్వహించాలని అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఆశ్చర్యం ఎందుకంటే ఈనెల 13 నుండి మూడు రోజుల పాటు ఉదయ్ పూర్లో కాంగ్రెస్ అగ్రనేతలు చింతన్ శిబిర్ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ శిబిరంలో కూడా జాతీయ స్ధాయిలోని కాంగ్రెస్ నేతలంతా హాజరవుతారు.

సంస్ధాగతంగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలు, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో సమావేశాలు జరుగుతాయి. ఇది ఎప్పుడో డిసైడ్ అయిన కార్యక్రమం అని అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇలాంటి కార్యక్రమమే రెండు రోజుల పాటు బీజేపీ అగ్రనేతలు కూడా జరపాలని అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. అది కూడా రాజస్థాన్ లోనే జరపబోతున్నారు.

కాంగ్రెస్ భేటీ అయిపోయిన ఐదు రోజుల వ్యవధిలోనే కమలనాథుల రెండు రోజుల సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరగబోయే సమావేశాల్లో దేశంలోని అన్నీ పార్టీల అధ్యక్షులు, కొందరు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు,జాతీయ ప్రధాన కార్యదర్శలు తదితరులు పాల్గొంటారు.

దేశంలోని పరిస్థితులు, ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, మెరుగైన ఫలితాలు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలుంటాయి.

తొందరలోనే జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా ప్రజంటేషన్ ఉంటుంది. కరోనా వైరస్ తీవ్రత కారణంగా గడచిన రెండేళ్ళుగా ముఖాముఖి జరగాల్సిన సమావేశాలు జరగలేదు.

అందుకనే ఈనెలలో జరగబోతున్న సమావేశాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. మామూలుగా అయితే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే జాతీయ పార్టీలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టే రాజస్ధాన్లో సమావేశాలు నిర్వహిస్తోంది. మరి బీజేపీ కూడా ఇక్కడే ఎందుకు నిర్వహిస్తోందో అర్ధం కావటంలేదు. మొత్తానికి రెండు జాతీయ పార్టీల జాతీయ సమావేశాల కారణంగా రాజస్థాన్ లో హడావుడి మొదలైపోయింది.