Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ కు భారతరత్న సాధ్యమేనా ?

By:  Tupaki Desk   |   30 March 2022 5:32 AM GMT
ఎన్టీయార్ కు భారతరత్న సాధ్యమేనా ?
X
ఎన్టీయార్ కు భారతరత్న ఇచ్చే వరకు కేంద్రంపై పోరాడుతామని చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రతి తెలుగు వాడి కోరికగా చంద్రబాబు చెప్పారు. ఎన్టీయార్ కు భారతరత్న ఇస్తే దేశాన్ని గౌరవించుకున్నట్లు అవుతుందని చంద్రబాబు కేంద్రానికి గుర్తు చేశారు.

ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలనే విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండదు. కానీ ఈ డిమాండ్ దశాబ్దాల తరబడి వినిపిస్తూనే ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్టీయార్ కు భారతరత్న అనే డిమాండ్ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడే ఎక్కువగా వినిపిస్తుంటుంది. అధికారంలో ఉన్నపుడు ఎన్టీయార్ కు భారతరత్న ఇప్పించాలని చంద్రబాబుకు ఎందుకు అనిపించదో అర్థం కావటంలేదు. రెండు విడతలుగా చంద్రబాబు దాదాపు 14 ఏళ్ళు సీఎంగా పనిచేశారు.

ఆ కాలంలో ఒక్కసారికూడా ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేయలేదు. కేంద్రంలో తాను చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు మరప్పట్లో ఎందుకు ఎన్టీయార్ కు భారతరత్న ఇప్పించలేకపోయారు ?

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ లో దాదాపు నాలుగేళ్ళు భాగస్వామిగా ఉన్నారు. అప్పుడు కూడా భారతరత్న డిమాండ్ చేయలేదు. అయితే టీడీపీ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఎన్టీయార్ కు భారతరత్న డిమాండ్ వినిపిస్తుంటారు. ఇపుడు చేసిన డిమాండ్ కూడా ఇందులో భాగమే అని గుర్తించాలి.

విచిత్రం ఏమిటంటే ఎన్టీయార్ కూతురు పురందేశ్వరి బీజేపీలో కీలక నేత. అయినా ఆమె కూడా తన తండ్రికి భారతరత్న ఇప్పించుకునే దిశగా ప్రయత్నాలు చేసినట్లు లేదు. నిజంగానే ఒక ముఖ్యమంత్రి గట్టిగా ప్రయత్నిస్తే భారతరత్న పురస్కారం రావటం పెద్ద కష్టం కాదు. అలాంటిది 13 సంవత్సరాలు సీఎంగా చేసినా ఎన్టీయార్ కు భారతరత్న ఇప్పించుకోలేకపోయారంటే ఏమిటర్ధం ?