Begin typing your search above and press return to search.

మంత్రి గంగుల ఇంట్లో సోదాలకు కారణం బండి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు?

By:  Tupaki Desk   |   9 Nov 2022 11:30 AM GMT
మంత్రి గంగుల ఇంట్లో సోదాలకు కారణం బండి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు?
X
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈడీ.. ఐటీ కంపెనీలు ఉమ్మడిగా చేస్తున్న తనిఖీలు.. దాడులు సంచలనంగా మారాయి. ఈ ఉదయం (బుధవారం) మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద అధికారులు చేస్తున్న సోదాల వైనం షాకింగ్ గా మారింది. హైదరాబాద్.. కరీంనగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సోదాలు సాగుతున్నాయి. మంత్రి గంగులతో పాటు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు.. ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ లోని పంజాగుట్టలోని పీఎస్ఆర్ గ్రానైట్స్.. హైదర్ గూడలోని జనప్రియ అపార్టుమెంట్ లో తనిఖీలు నిర్వహించారు. అంతేకాదు.. సోమాజీగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర ఇంట్లోనూ సోదాలు జరిగాయి. మంత్రి గంగులకు చెందిన శ్వేత గ్రానెట్.. కమాన్ ప్రాంతంలోని మహవీర్.. ఎస్వీఆర్ గ్రానైట్స్ లోనూ సోదాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ సోదాల వెనుక మూడేళ్ల క్రితం తెలంగాణ బీజేపీకి చెందిన ఇద్దరు నేతలు ఇచ్చిన ఫిర్యాదు పుట్ట ఇప్పుడు పగిలినట్లుగా చెబుతున్నారు.

అప్పట్లో కరీంనగర్ లో చోటు చేసుకుంటున్న అక్రమ మైనింగ్.. గ్రానైట్ వ్యవహారాలకు సంబంధించిన పూర్తి ఆధారాలతో పాటు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ తో పాటు.. టీ బీజేపీ సీనియర్ నేత.. పార్టీ వ్యూహకర్తగా తెర వెనుక ఉండే శేఖర్ జీ ఇచ్చిన కంప్లైంట్ల ఆధారంగానే తాజా సోదాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ అప్పట్లో వారిచ్చిన ఫిర్యాదులోని అంశాలేమిటి? ఏయే అంశాల్ని వారు ప్రస్తావించారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

- కాకినాడలోని కొన్ని పోర్టుల ద్వారా కరీంనగర్ కి చెందిన గ్రానైట్ బ్లాకులను అక్రమంగా తరలిస్తున్నారు. దీని ద్వారా భారీ ఎత్తున ప్రభుత్వ ఆధాయానికి గండి కొట్టారు.

- కేసీఆర్ ప్రభుత్వంలోని కీలక పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు ఇందులో ఉన్నారు.

- ప్రభుత్వంలోని కీలక నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాల్ని అడ్డు పెట్టుకొని పెనాల్టీలను ఎగ్గొట్టిన అక్రమంగా తరలిస్తున్నారు.

- తమ వ్యాపారానికి సంబంధించిన వివరాల్ని సైతం తప్పుగా చెబుతున్నారు. తప్పుడు సమాచారాన్ని ఇచ్చినందుకు ఐదు రెట్లు పెనాల్టీ విధించాల్సి ఉంటుంది.

- అక్రమ పద్దతిలో చైనాకు గ్రానైట్ బ్లాకుల్ని పంపిన కంపెనీలపై అక్కడి ప్రభుత్వం.. సీరియస్ గా ఉంది. తీవ్రమైన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన బండి సంజయ్.. ఇది తీవ్రమైన ఆర్థిక నేరం కాబట్టి.. వెంటనే జోక్యం చేసుకొని తప్పుడు కార్యకలాపాలకు పాల్పడిన కంపెనీలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

అలా మూడేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదు మీద విచారణ జరిపి.. తాజాగా తనిఖీలు.. సోదాలు మొదలయ్యాయి. ఇప్పుడీ ఉదంతం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కలకలాన్ని రేపటమే కాదు.. రాజకీయ దుమారానికి కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.