Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ కు పవన్ మద్దతుపై అమిత్ షా సీరియస్?

By:  Tupaki Desk   |   14 March 2021 11:00 PM IST
టీఆర్ఎస్ కు పవన్ మద్దతుపై అమిత్ షా సీరియస్?
X
బీజేపీ-జనసేన పొత్తు ముందుకు సాగేలా కనిపించడం లేదన్న ప్రచారం జోరందుకుంది. ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్ యే ఆ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టిందన్న వాదన వినిపిస్తోంది.

ఏపీలో తిరుపతి ఎంపీ సీటును బీజేపీకే వదిలేసిన పవన్.. తెలంగాణలో అదే బీజేపీతో కటీఫ్ చేసుకోవడం సంచలనమైంది. తెలంగాణ బీజేపీ నేతలు జనసేనను అవమానించారని.. తీసిపారేసినట్టు మాట్లాడారని.. గౌరవం లేని చోట పొత్తు ఉండదని పవన్ వ్యాఖ్యానించి ఏకంగా తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. ఈ పరిణామంపై బీజేపీ భగ్గుమన్నట్టు సమాచారం. పవన్ ప్రకటనతో ఇక జనసేనతో తెగదెంపులేనా అన్న చర్చ సాగుతోంది.

జాగా హైదరాబాద్ లో జరిగిన జనసేన ఆవిర్బావ వేడుకల్లో భాగంగా మాట్లాడిన పవన్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘బీజేపీ కేంద్ర నాయకత్వం జనసేనతో ఉన్నా తెలంగాణ బీజేపీ మా పార్టీని అవమానించింది. జనసేనను చులకన చేసేలా తెలంగాణ బీజేపీ మాట్లాడింది. అందుకే తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థి అయిన పీవీ కుమార్తె వాణికి మద్దతిస్తున్నాం. పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడు’ అని పవన్ స్పష్టం చేశారు.

ఈ ప్రకటన బీజేపీలో దుమారం రేపింది. బీజేపీతో పవన్ కటీఫ్ దిశగా పయనిస్తున్నాడా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ప్రతీసారి పవన్ కళ్యాణ్ ను బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం లేదని జనసేన నేతల్లో ఒకింత ఆగ్రహావేశాలే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించిన జనసేనను కాదని తిరుపతిలో బీజేపీ పోటీచేయడంపై ఇప్పటికే వారంతా రగిలిపోతున్నారు.

ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లోనూ జనసేన బీజేపీతో కాకుండా ఒంటరిగా పోటీచేస్తుందని పవన్ ప్రకటించడం సంచలనమైంది. తెలంగాణ బీజేపీ నేతలతో ఎలాంటి పొత్తు గానీ.. వారికి అండగా నిలిచేది లేదని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణ జనసేన పార్టీ శ్రేణుల గౌరవం తనకు ముఖ్యమని.. అది దక్కనప్పుడు వారితో కలవాల్సిన పని లేదని తేల్చిచెప్పారు.

అయితే పవన్ చేసిన ప్రకటన బీజేపీ-జనసేన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది చిలికి చిలికి గాలివానగా మారే ప్రమాదం కనిపిస్తోందంటున్నారు. తాజాగా కొందరు తెలంగాణ బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ మిత్ర ధర్మాన్ని పాటించట్లేదని.. మిత్రుడిగా ఉంటూనే మోసం చేశారని కొందరు బీజేపీ నేతలు ఆరోపించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక టీఆర్ఎస్ కు జనసేన మద్దతు ఇవ్వడంపై బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై ఆరాతీశారని అంటున్నారు.దీనిపై నివేదిక పంపాల్సిందిగా తెలంగాణ బీజేపీ నేతలకు సూచించినట్టు సమాచారం.

కాగా తిరుపతిలో ఎంపీ సీటును బీజేపీ లాక్కోవడమే పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పునకు కారణం అయ్యి ఉంటుందని.. పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేనను కాదని బీజేపీ సీటు తీసుకోవడంపై రగిలిపోయి పవన్ ఇలా బయటపడ్డారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.